భారత టీ20 క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవం, అంతకుముందు Ireland పర్యటనలో చతికిలపడటం కలిసి భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. 2026 T20 వరల్డ్ కప్ విజయం తర్వాత జట్టు ఆటతీరు ఒక్కసారిగా అట్టడుగు స్థాయికి పడిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలపై BCCI తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపికలో సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి, యువ క్రికెటర్లతో వరుస ప్రయోగాలు చేయడం జట్టును బలహీనపరిచిందని బోర్డు పెద్దలు భావిస్తున్నారని సమాచారం. ఈ వైఫల్యాలకు గంభీర్ అనుసరించిన వ్యూహాలే కారణమని BCCI నిర్వాహకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. రికీ పాంటింగ్ , స్టీఫెన్ ఫ్లెమింగ్ , జస్టిన్ లంగర్

ఈ క్రమంలో అర్ధరాత్రి జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో గంభీర్ పదవికి ముగింపు పలకాలని బోర్డు నిర్ణయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై BCCI అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ, జట్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కోచ్ మార్పు దిశగా బోర్డు అడుగులు వేస్తోందనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

గంభీర్ స్థానంలో భారత జట్టుకు సరికొత్త మార్గదర్శకత్వం అందించగల సమర్థుడైన కోచ్ కోసం BCCI అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం ముగ్గురు అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు రేసులో ముందంజలో ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా కు రెండు వరల్డ్ కప్ లు అందించిన పాంటింగ్ , ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ , పంజాబ్ జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నాడు. దూకుడైన శైలి, ఆగ్రెసివ్ ఆలోచనలతో పాంటింగ్ అయితేనే ఈ కుంగుబాటులో ఉన్న భారత జట్టును మళ్లీ గాడిన పెట్టగలడని BCCIలో కొంతమంది భావిస్తున్నారని తెలుస్తోంది.

న్యూ జిల్యాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషించిన ఫ్లెమింగ్ , ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచుతూ వారి నుంచి అత్యుత్తమ ప్రతిభను రాబట్టడంలో నిపుణుడిగా గుర్తింపు పొందాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ జట్టును విజయపథంలో నడిపిన కఠినమైన కోచ్ జస్టిన్ లంగర్ పేరును కూడా BCCI పరిశీలిస్తున్నట్లు సమాచారం. జట్టులో క్రమశిక్షణ, గెలుపు కసిని పెంచడంలో లంగర్ పాత్ర కీలకమని కొందరు బోర్డు సభ్యులు అభిప్రాయపడుతున్నారని వర్గాలు చెబుతున్నాయి.

కొత్త కోచ్ ఎంపికతో పాటు జట్టు ఎంపిక విధానంలోనూ BCCI విప్లవాత్మక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై తుది జట్టును ఎంపిక చేసే విషయంలో ప్రధాన కోచ్, కెప్టెన్ జోక్యం గణనీయంగా తగ్గనుంది. పూర్తి అధికారాలను సెలక్షన్ కమిటీ కి అప్పగిస్తూ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేస్తోందని సమాచారం. ప్రయోగాల పేరిట జట్టును బలహీనపరచడం ఇకపై సహించబోమని, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే జట్టులో అవకాశం కల్పించే దిశగా నూతన విధానాలు రూపుదిద్దుకుంటున్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంగ్లండ్ సిరీస్‌లో 0-3 తేడాతో ఎదురైన పరాభవం తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త కూర్పుగా విమర్శిస్తున్న పరిస్థితుల్లో, BCCI తీసుకోబోతున్న ఈ కఠిన నిర్ణయాలు భారత క్రికెట్‌ను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురాగలవా అన్నది ఆసక్తికరంగా మారింది.