రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
టార్గెట్.. 2027 వన్డే ప్రపంచకప్!
రోడ్ మ్యాప్ సిద్ధం!
వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీకి నిర్దిష్టమైన ప్రణాళిక (రోడ్‌మ్యాప్)ను రూపొందించడం ప్రారంభమైందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ప్రపంచ కప్ ముందు టీమ్‌ఇండియా తగినన్ని 50 ఓవర్ల క్రికెట్ మ్యాచులు ఆడేలా చూస్తామని తెలిపారు. ‘‘వచ్చే ఏడాది అక్టోబర్‌లో టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. జులై 14 నుంచి 19 వరకు ఆ సిరీస్ జరగనుంది. రాబోయే కాలంలో మరిన్ని మ్యాచులను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. మ్యాచ్ ప్రాక్టీస్ వల్ల కప్పు గెలిచేందుకు అవకాశాలు మెరుగవుతాయని’’ అని సైకియా పేర్కొన్నారు.
‘కప్పు నెగ్గడమే టీమ్‌ఇండియా లక్ష్యం. అందుకోసం కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందిస్తాం. రోడ్ మ్యాప్ తయారీలో హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ నుంచి సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతారు. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద ఈవెంట్‌కు వెళ్లేటప్పుడు మంచి సన్నద్ధత అవసరం. ఆ విషయంలో టీమ్‌ఇండియాకు కావాల్సినవన్నీ చేసేందుకు బీసీసీఐ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది’’ అని దేవజిత్ సైకియా వెల్లడించారు.







