రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు టీమిండియా రెడీ…
ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం దిశగా
వన్డే ప్రపంచకప్–2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత్ స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే శనివారం ధర్మశాల వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ధర్మశాలకు చేరుకుని నెట్‌లలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయాల కారణంగా అందుబాటులో లేరు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, హార్దిక్ కు బదులుగా ఎవరు ఆడబోతున్నారో సెలెక్టర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చన్న దానిపై అంచనాలు మొదలయ్యాయి.
భారత ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ప్రారంభించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ లేని నేపథ్యంలో మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ చివరిసారిగా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గానిస్తాన్‌పై భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వన్డే జట్టులోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.
విరాట్ ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్ మాత్రం తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిసారిగా డిసెంబర్ 2025లో సౌత్ ఆఫ్రికా తో వన్డే ఆడాడు. అతడు ప్రధానంగా ఓపెనర్‌గా మాత్రమే ఆడగలడు. కాబట్టి రోహిత్ శర్మకి విశ్రాంతి ఇచ్చినప్పుడే జైస్వాల్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది.
నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో వికెట్ కీపర్–బ్యాటర్ KL రాహుల్ బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. ఆల్‌రౌండర్ల విభాగంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కి అవకాశం దక్కే అవకాశం బలంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్య తొడ కండరాల గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో నితీష్ తన 10 ఓవర్ల కోటాను పూర్తి స్థాయిలో వినియోగించాల్సి వచ్చే అవకాశం ఉంది. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
పేస్ విభాగంలో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. IPL–2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ప్రిన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రాహ్, మహమ్మద్ సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు లేకపోవడంతో ప్రిన్సు కు తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ వంటి యువ పేసర్లతో కలిసి ప్రిన్స్ బౌలింగ్ దళాన్ని నడిపే అవకాశం ఉంది. యార్కర్లు వేయడంలో అతడు ప్రత్యేక నైపుణ్యం కలిగిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
అంచనా భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ , అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ .







