ఫుట్‌బాల్ కోచ్ మోసం!

కెరీర్ ఆశ చూపి మైనర్‌పై మూడేళ్లపాటు అత్యాచారం

పాల్ఘర్, మహారాష్ట్ర: ఫుట్‌బాల్‌లో కెరీర్ అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి, ఒక మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్లపాటు అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు 36 ఏళ్ల అభిజిత్ మెండల్. అతనిపై బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో)తో పాటు అత్యాచారం, నేరపూరిత బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వసాయిలో అతను నడుపుతున్న ఫుట్‌బాల్ శిక్షణా అకాడమీలో ఈ ఘటనలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది.

2023లో వసాయిలోని మెండల్ ఫుట్‌బాల్ శిక్షణా అకాడమీలో 17 ఏళ్ల బాలిక చేరింది. ఆ తరువాత కాలంలో కోచ్ మెండల్ ఆమెపై పదేపదే అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర వీడియోలను కూడా నిందితుడు చిత్రీకరించినట్లు, తరువాత వాటిని ఉపయోగించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తన ఫిర్యాదులో బాధితురాలు, మెండల్ ముందుగా తన నమ్మకాన్ని సంపాదించాడని, ఫుట్‌బాల్‌లో పెద్ద అవకాశాలు కల్పిస్తానని చెప్పి తనను ప్రలోభపెట్టాడని పేర్కొంది. గత మూడేళ్లుగా అతను పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఈ వేధింపులతో విసిగిపోయిన ఆమె, కోచ్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో తెలిపింది.

దీంతో కోచ్ మెండల్ తన వద్ద ఉన్న వీడియోలు, ఫోటోలను చూపించి ఆమెను బెదిరించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని నిందితుడు హెచ్చరించినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. నిరంతర మానసిక వేధింపులతో తీవ్రంగా కలత చెందిన ఆ బాలిక చివరకు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు వెల్లడించింది.

కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, వసాయ్‌లోని మణిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు అభిజిత్ మెండల్‌ను అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, బాధితురాలికి అవసరమైన సహాయం, రక్షణ కల్పిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానిక క్రీడా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.