టీమిండియా నిర్లక్ష్యంతో కౌంటీకి కుల్దీప్ యాదవ్..

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్ షైర్ తో కుల్దీప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌లో యార్క్ షైర్ జట్టుకు కీలక సేవలు అందించనున్నాడు.

ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కకపోవడం, ప్రస్తుతం జింబాబ్వే తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక కాకపోవడంతో కుల్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే సిరీస్‌లో ఇండియా 1-2తో ఓటమిపాలైనప్పటికీ, కుల్దీప్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు.

చివరి వన్డేలో జస్ప్రీత్ బుమ్రాహ్ లేకపోయినా స్పిన్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా పేస్ బౌలర్లతోనే బరిలోకి దిగిన టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ మ్యాచ్‌లో ఇండియా ముందుగా బౌలింగ్ చేసి 387 పరుగులు సమర్పించుకుని, చివరకు 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కుల్దీప్‌ను పక్కన పెట్టడం సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సీజన్‌లో యార్క్ షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇందులో ఐదు Metro బ్యాంకు వన్ డే కప్ మ్యాచ్‌లతో పాటు, సెప్టెంబర్‌లో జరిగే కౌంటీ ఛాంపియన్షిప్ చివరి నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో బరిలోకి దిగనున్నాడు. ఈ శుక్రవారం గ్లమోర్గన్ తో నీత్ వేదికగా జరిగే 50 ఓవర్ల మ్యాచ్‌లో యార్క్ షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేయనున్నాడు.

ప్రస్తుతం కుల్దీప్ ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినా, తనకు అవకాశం రాకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో శ్రీ లంక తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు తన రిథమ్‌ను కొనసాగించేందుకు ఈ కౌంటీ అనుభవం ఉపయోగపడుతుందని అతడు భావిస్తున్నాడు. శ్రీ లంక సిరీస్ అనంతరం మళ్లీ యార్క్ షైర్ జట్టుతో కలిసి కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడనున్నాడు.

యార్క్‌షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లండ్ పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ నాకు సవాలే. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఈ అవకాశంపై మరింత ఉత్సాహం కలిగింది. హెడ్డింగ్‌లేలో జట్టుకు నా వంతు సహకారం అందించేందుకు ఎదురుచూస్తున్నాను

యార్క్ షైర్ క్రికెట్ జనరల్ మేనేజర్ గావిం హామిల్టన్ కూడా కుల్దీప్ రాకపై సంతోషం వ్యక్తం చేశాడు.

కుల్దీప్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రపంచ స్థాయి స్పిన్నర్. ఈ వేసవిలో ఇంగ్లండ్‌లో పొడి వాతావరణం నెలకొనడంతో సీజన్ చివరి దశలో స్పిన్ కీలక పాత్ర పోషించనుంది. అతని లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ మా బౌలింగ్ దళానికి కొత్త బలాన్ని అందిస్తుంది. అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది

కుల్దీప్ ఇప్పటివరకు ఇండియా తరఫున 18 టెస్టుల్లో 79 వికెట్లు, 121 వన్డేల్లో 194 వికెట్లు, 54 టీ20ల్లో 95 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈ స్పిన్నర్, ఇప్పుడు కౌంటీ క్రికెట్‌లోనూ తన ప్రతిభను మరింత పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు.