రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఐపీఎల్ వివాదాలు కల్పితమే:
కావాలనే ఇలాంటి వివాదాలను సృష్టి :
లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభ దశల్లో మైదానం వెలుపల చోటుచేసుకున్న అనేక వివాదాలు వాస్తవానికి కల్పితాలేనని లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వెల్లడించాడు. టోర్నమెంట్ టెలివిజన్ రేటింగ్స్ తగ్గుతున్నప్పుడు కావాలనే ఇలాంటి వివాదాలను సృష్టించి ప్రచారం చేసేవారమని ఆయన స్పష్టం చేశాడు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లలిత్ మోదీ, ఐపీఎల్ నిర్వహణలో భాగంగా అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మాట్లాడాడు. సంచలన విషయాలు బయట పెట్టారు. వ్యూయర్‌షిప్ పడిపోతుందనే భావన కలిగినప్పుడు మేనేజ్‌మెంట్ ఉద్దేశపూర్వకంగా వార్తల్లో నిలిచే అంశాలను సృష్టించేదని ఆయన వివరించాడు. ఈ క్రమంలో ఒక దక్షిణాఫ్రికా క్రికెటర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఉదంతాన్ని కూడా ప్రస్తావించాడు.
టోర్నీ రేటింగ్ పడిపోతున్న ప్రతిసారీ మేమే ఏదో ఒక వివాదం సృష్టించేవాళ్లం. ఇందులో భాగంగా అప్పట్లో ఐపీఎల్‌లో ఆడుతున్న ఒక దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు చీర్‌లీడర్‌తో ఎఫైర్ ఉందనే వార్తను నేనే వ్యాప్తి చేశా. దీంతో టోర్నీ రేటింగ్స్ గణనీయంగా మెరుగయ్యాయి. ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు” అని లలిత్ మోదీ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో తరచూ బయటికొచ్చిన గాసిప్‌లు, వ్యక్తిగత సంబంధాలపై వచ్చిన కథనాల నేపథ్యంలో లలిత్ మోదీ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం, చీర్‌లీడర్లపై వచ్చిన వార్తల నిజానిజాలపై అప్పటినుంచే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మోదీ స్వయంగా కొన్ని వార్తలు తాము సృష్టించామని చెప్పడంతో ఆ కాలం ఐపీఎల్ ప్రచార వ్యూహాలపై కొత్త దృష్టికోణం వెలుగులోకి వచ్చినట్టైంది.
ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో టోర్నమెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించినప్పటికీ, కొన్ని దశల్లో టెలివిజన్ రేటింగ్స్ ఊహించినంత స్థాయిలో లేకపోయిన సందర్భాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతుంటాయి. అటువంటి సమయంలోనే వివాదాస్పద కథనాలు, సంచలనాత్మక వార్తలు ఎక్కువగా బయటకు వచ్చాయని అప్పటి మీడియా రిపోర్టులు సూచించాయి. లలిత్ మోదీ తాజా వ్యాఖ్యలు ఆ అనుమానాలకు కొంతవరకు బలం చేకూర్చినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక లలిత్ మోదీ గత కొంతకాలంగా ఐపీఎల్ నిర్వహణ, ఫ్రాంచైజీల యాజమాన్యం, బోర్డు నిర్ణయాలపై తరచూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఈ వెల్లడి, టోర్నమెంట్ ప్రారంభ దశల్లో అనుసరించిన మార్కెటింగ్, ప్రచార పద్ధతులపై కొత్త చర్చకు దారితీసింద లలిత్ మోదీ తెలిపారు.







