భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ ప్రపంచంలో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా చరిత్రలో పేరు నిలిపాడు. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానా పై ప్రజ్ఞానంద 15-13 తేడాతో విజయం నమోదు చేశాడు.

ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రజ్ఞానంద 6 పాయింట్ల వెనుకబడి ఉన్నాడు. అయితే కీలక సమయంలో అతడు వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్‌లను గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మొత్తం స్కోరులో కరువానాను మట్టికరిపించాడు. దీంతో గ్రాండ్ చెస్ టూర్‌లో తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విజయం ద్వారా ప్రజ్ఞానంద దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అదే సమయంలో వచ్చే ఏడాది జరగనున్న గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హత సాధించాడు. చెస్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సిరీస్‌లలో ఒకటైన ఈ టూర్‌లో భారత ఆటగాడు విజేతగా నిలవడం దేశానికి గర్వకారణంగా మారింది.

“ఇవాళ నేను గెలిచే అవకాశాలు వస్తాయని అనుకోలేదు. ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నా. ఇలాంటప్పుడే ఎలా ఆడాలో చూపించా. ఫాబి వంటి ప్లేయర్‌పై ఒక్క మ్యాచ్ గెలవడమే కష్టం. ర్యాపిడ్‌లో రెండు గేమ్‌ల్లో విజయం సాధించా. గతేడాది నుంచి నా ర్యాపిడ్, బ్లిట్జ్ గేమ్‌లో మార్పులు చేసుకున్నా. ఇప్పుడు ఆ ఫలితం కనిపించింది. ఈ ఫార్మాట్‌లో మెరుగయ్యాననే అనుకుంటున్నా” అని ప్రజ్ఞానంద (Praggnanandhaa) తెలిపాడు.

ఈ ఏడాది ఆరంభం ప్రజ్ఞానందకు అంతగా అనుకూలంగా సాగలేదు. క్యాండిడేట్స్ టోర్నీలో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే ఆ తర్వాత తన ఆటను మెరుగుపరుచుకుంటూ నార్వే చెస్ టోర్నీని గెలిచాడు. అక్కడ మాగ్నస్ కార్ల్‌సన్ (Magnus Carlsen) వంటి ప్రపంచ నంబర్ వన్ గ్రాండ్‌మాస్టర్‌పై రెండుసార్లు విజయం సాధించడం అతని కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.

నార్వే చెస్ విజయానంతరం ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్, సింక్‌ఫీల్డ్ కప్‌లను కూడా సొంతం చేసుకున్నాడు. వరుస విజయాలతో అతడు ప్రపంచ చెస్ రంగంలో తన స్థాయిని మరింత బలపరుచుకున్నాడు. క్యాండిడేట్స్‌లోనూ గెలిచి ఉంటే బాగుండేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన ప్రజ్ఞానంద, ఇప్పుడు గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌తో ఆ లోటును కొంత మేర పూడ్చుకున్నట్టయ్యాడు.

భారత చెస్‌కు కొత్త దిశ చూపుతున్న ప్రజ్ఞానంద తాజా విజయం, దేశ యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయి టోర్నీల్లో భారత ఆటగాళ్లు నిలదొక్కుకునే సామర్థ్యం ఉన్నదని అతడు మరోసారి నిరూపించాడు.