టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డేలకు రిటైర్మెంట్‌ పలుకుతాడా? ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలగాలని బీసీసీఐ (BCCI) అతడికి పరోక్షంగా అల్టిమేటం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటాక్‌ స్పందించారు. ‘రిటైర్మెంట్‌’ విషయంలో రోహిత్‌ (Rohit Sharma)పై మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ఒత్తిడి పెట్టట్లేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..

ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగే చివరి వన్డేనే రోహిత్‌కు ఆఖిరిదంటూ వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ సిరీస్‌ తర్వాత వన్డేలకు అతడిని ఎంపిక చేసే అవకాశాల్లేవు. అయితే, భవిష్యత్తుపై అతడే నిర్ణయం తీసుకోవాలి. రిటైర్‌ కావాలని అతడికి ఎవరూ చెప్పరు’’ అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రతినిధులతో రోహిత్‌ సమావేశమయ్యాడని.. బోర్డు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం.

ఈ పరిణామాలపై బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటాక్‌ స్పందించారు. ‘‘రోహిత్ శర్మ లాంటి సీనియర్‌ ఆటగాడిపై ఇలాంటి ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. అతడు కూడా ఒత్తిడి ఉందని ఫీలయ్యే ఆటగాడు కాదు. నిజమే.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో అతడు పరుగులేం చేయలేదు. అంతమాత్రాన.. అతడి కెరీర్‌ విషయంలో పెద్ద తేడా ఏం ఉండదు. రోహిత్‌ ఇబ్బంది పడుతున్నాడని నేను చెప్పను. బహుశా షాట్ల ఎంపిక పనిచేయకపోవచ్చు. లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేల్లో తప్పకుండా అతడి నుంచి భిన్నమైన ఇన్నింగ్స్‌ను మనం చూస్తాం’’ అని కోచ్‌ వివరించారు.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్‌ ఆకట్టుకోలేకపోయాడు. తొలి వన్డేలో 11 పరుగులు చేసిన అతడు.. రెండో వన్డేలో 47 బంతులు ఎదుర్కొని 26 పరుగులకు ఔటయ్యాడు. గత ఎనిమిది వన్డే మ్యాచ్‌ల్లో 30.1 సగటుతో కేవలం 241 పరుగులు చేశాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో రోహిత్‌ను ఎంపిక చేస్తారా? లేదా అన్న సందిగ్ధత వేళ.. ఈ రిటైర్మెంట్‌ వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

గంభీర్‌తో కోహ్లీ మాట్లాడట్లేదా..?

మరోవైపు, కోహ్లీ-గంభీర్‌ మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలపైనా సితాన్షు స్పందించాడు. ‘‘చాలాసార్లు ఇలాంటి ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ, వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రెండో వన్డే సమయంలోనూ వీరిద్దరూ కనీసం 10 సార్లు మాట్లాడుకుని ఉంటారు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావట్లేదు’’ అని బ్యాటింగ్‌ కోచ్‌ తెలిపారు.