పారిస్‌: రొలాండ్‌ గారోస్‌లో ఈసారి మహిళల సింగిల్స్‌లో ఓ కొత్త గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్‌ అరీనా సబలెంకా ఆశలు క్వార్టర్‌ఫైనల్‌ దశలోనే ముగిశాయి. స్టార్లందరూ వరుసగా నిష్క్రమిస్తున్న వేళ టోర్నీలో ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంకా కీలక ఘట్టంలో తడబడి సెమీఫైనల్‌ దశను అందుకోలేకపోయింది.

మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌లో 25వ సీడ్‌ డయానా ష్నైడర్‌ (రష్యా) 3-6, 7-5, 6-0తో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుచుకున్న సబలెంకాను చిత్తు చేసింది. తొలి సెట్లో సబలెంకా తన శక్తివంతమైన ఆటతో ఆధిపత్యం చాటింది. రెండో సెట్లో కూడా 4-1 ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుంటుందనిపించింది. ఆ తర్వాత కూడా 5-4తో ముందంజలో ఉండి మ్యాచ్‌ కోసం సర్వ్‌ చేసిన సబలెంకా 30-15తో విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో నిలిచింది.

అయితే ఈ దశ నుంచి ష్నైడర్‌ అద్భుతంగా పుంజుకుంది. కీలక సమయంలో సబలెంకా సర్వ్‌ను బ్రేక్‌ చేసి మ్యాచ్‌ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఆత్మవిశ్వాసం పెంచుకున్న ష్నైడర్‌ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి రెండో సెట్ను 7-5తో గెలుచుకుంది. మరోవైపు సబలెంకా వరుసగా పొరపాట్లు చేస్తూ, ముఖ్యంగా బంతిని నెట్‌కు కొడుతూ మ్యాచ్‌కు దూరమైంది. నిర్ణయాత్మక మూడో సెట్లో ష్నైడర్‌ ఏకపక్షంగా ఆడి 6-0తో గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమె వరుసగా పది గేమ్‌లు గెలుచుకోవడం విశేషం.

మహిళల విభాగంలో సెమీఫైనల్‌కు చేరిన నలుగురు ఆటగాళ్లూ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కూడా గెలుచుకోలేదు. దీంతో ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్‌ ఖాయమైంది. ష్నైడర్‌ సెమీఫైనల్‌లో మజా చ్వాలిన్‌స్కా (పొలెండ్‌)ను ఎదుర్కోనుంది. క్వార్టర్‌ఫైనల్లో చ్వాలిన్‌స్కా 7-6 (7/3), 6-3తో అనా కలిన్‌స్కేయ (రష్యా)పై విజయం సాధించింది. మరో సెమీఫైనల్‌ స్థానాలను ఆండ్రీవా (రష్యా), మార్టా కొస్క్యూక్‌ (ఉక్రెయిన్‌) ఇప్పటికే ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.

పురుషుల సింగిల్స్‌లో చెక్‌ ఆటగాడు జాకబ్‌ మెన్సిక్‌ తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-4, 6-3, 7-6 (7/3)తో ఫోన్సెకా (బ్రెజిల్‌)పై గెలుపొందాడు. ఫైనల్‌ బర్త్‌ కోసం మెన్సిక్‌ ఇప్పుడు జ్వెరెవ్‌ను ఢీకొంటాడు. మరోవైపు పదో సీడ్‌ కొబోలి (ఇటలీ) కూడా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో అతడు 4-6, 6-4, 6-4, 6-4తో అగర్‌ అలియాసిమె (కెనడా)పై విజయం సాధించి సంచలనం సృష్టించాడు.

పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు శ్రీరామ్‌ బాలాజీ పోరాటం ముగిసింది. ఆరో సీడ్‌ జంటను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన బాలాజీ–మార్సిలో డెమోలినర్‌ (బెజిల్‌) జోడీ మరింత ముందుకు సాగలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ద్వయం 3-6, 4-6తో రెండో సీడ్‌ జంట హారి హెలియోవారా (ఫిన్లాండ్‌), హెన్రి పాటెన్‌ (బ్రిటన్‌) చేతిలో పరాజయం పాలైంది.