ఐసీసీ Women’s T20 వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న టీం ఇండియా కు గాయాల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆఫ్‌ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఈ టోర్నమెంట్‌ మిగతా భాగానికి దూరమైంది. నెథర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయపడింది. ఆ సమయంలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

శ్రేయాంక చీలమండ గాయం తీవ్రంగా ఉండటంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రకటించింది. దీంతో ఇప్పటికే బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ప్రధాన స్పిన్నర్‌ను భారత్ కోల్పోయింది.

శ్రేయాంక స్థానంలో మరో స్పిన్నర్‌కు అవకాశం కల్పిస్తూ భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. లెగ్ - స్పిన్నర్ ప్రేమా రావత్‌ను స్క్వాడ్‌లోకి చేర్చింది. ఈ మార్పుకు వరల్డ్ కప్ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రేమా రావత్ ఇంగ్లాండ్ లోనే టీం ఇండియా A జట్టుతో ఉంది. అందువల్ల ఆమె నేరుగా సీనియర్ జట్టుతో కలవనుంది.

అని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక ప్రకటనలో తెలిపింది.

లీగ్‌ దశలో భారత్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన టీం ఇండియా , పాకిస్తాన్ , నెథర్లాండ్ జట్లపై వరుస విజయాలు సాధించి గ్రూప్ Aలో అగ్రస్థానంలో ఉంది. రాబోయే మూడు మ్యాచ్‌లు సెమీఫైనల్ ఆశల పరంగా కీలకంగా నిలవనున్నాయి.

జూన్ 21న సౌత్ ఆఫ్రికా , జూన్ 25న బాంగ్లాదేశ్ , జూన్ 28న ఆస్ట్రేలియా జట్లతో భారత్ తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో గెలిచినా, గ్రూప్‌లో అగ్రస్థానంతోనే సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రేయాంక లేని లోటును ప్రేమా రావత్ ఎంతవరకు పూడ్చగలదన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

.