రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ బృందంలో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ Doeschate, ఫీల్డింగ్ కోచ్ T దిలీప్ ల కాంట్రాక్టులను పొడిగించబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరిణామంతో టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై చర్చ క్రికెట్ వర్గాల్లో వేడెక్కింది.
BCCI కార్యదర్శి దేవాజిత్ సాయికియా ప్రకారం, కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో మాజీ దేశవాళీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో “ఎవరీ సుభదీప్ ఘోష్?” అంటూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో అతని గురించి వివరాలు వెతుకుతున్నారు.
శుభదీప్ ఘోష్ 1968లో అస్సాం రాష్ట్రంలోని Digboiలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్ బౌలర్‌గా రాణించాడు. అతడు అస్సాం , రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 1994-95 సీజన్లో ఫస్ట్ - క్లాస్ , List-A క్రికెట్లో అరంగేట్రం చేసిన ఘోష్, తన కెరీర్లో 17 ఫస్ట్ - క్లాస్ మ్యాచ్‌లు, 17 List-A మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ - క్లాస్ క్రికెట్లో 316 పరుగులు, List-Aలో 307 పరుగులు చేశాడు. 2004లో తన చివరి ఫస్ట్ - క్లాస్ మ్యాచ్ ఆడగా, 2005లో List-A కెరీర్‌కు ముగింపు పలికాడు.
ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత శుభదీప్ ఘోష్ కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్న కాలం నుంచి గత ఆరు–ఏడు సంవత్సరాలుగా భారత క్రికెట్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అలాగే ఇండియా A, ఇండియా అండర్ -19 జట్లతో కూడా సేవలందించాడు. 2024 అండర్ -19 వరల్డ్ కప్ లో భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ లో సభ్యుడిగా ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా శుభదీప్ ఘోష్ కు మంచి అనుభవం ఉంది. 2014లో కోల్‌కతా కింగ్స్ రైడర్స్ (KKR) జట్టు రెండోసారి IPL టైటిల్ గెలిచిన సీజన్లో ఆ జట్టు కోచింగ్ బృందంలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. దేశవాళీ, జాతీయ, IPL స్థాయిల్లో విస్తృత అనుభవం ఉండటంతో టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ రేసులో అతడు ముందంజలో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
T దిలీప్ స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించేందుకు BCCI ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులతో చర్చలు కొనసాగుతున్నాయని బోర్డు వర్గాలు సూచిస్తున్నాయి. శ్రీ లంక పర్యటనకు ముందు కొత్త ఫీల్డింగ్ కోచ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో శుభదీప్ ఘోష్ నే ప్రధాన ఫేవరెట్‌గా, దాదాపు ఖరారైన అభ్యర్థిగా భావిస్తున్నట్లు బోర్డు వర్గాల అంచనా.







