హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఈ ఏడాది ప్రారంభించిన టీజీ20 క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు తొలి సీజన్‌ విజేతగా నిలిచింది. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ స్వాధీనం చేసుకున్న హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి పెట్టిన పేరు ఈ ఛాంపియన్స్‌. పేరుకు తగ్గట్టుగానే టోర్నీ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించిన ఈ జట్టు, ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌పై ఘనవిజయం సాధించి కప్పును ఎత్తుకుంది.

లీగ్‌ దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించిన ఈ ఛాంపియన్స్‌, క్వాలిఫయర్‌-1లో ఓటమి చవిచూసినా, ఫైనల్లో అదే ఖమ్మం ఏసెస్‌ను చిత్తు చేసి తమ సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ జట్టు 17.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

హైదరాబాద్‌ తరఫున కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి 30 బంతుల్లో 6 బౌండరీలు, ఒక సిక్స్‌తో 48 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. షణ్ముఖ అశ్విన్‌ 21 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో దూకుడుగా ఆడాడు. చివర్లో వైష్ణవ్‌ రెడ్డి 28 బంతుల్లో 41 నాటౌట్‌ (1 ఫోర్‌, 3 సిక్సర్లు), ప్రణవ్‌ వర్మ 19 నాటౌట్‌ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

చేదన ఆరంభంలో ఈ ఛాంపియన్స్‌ ఒత్తిడిని ఎదుర్కొంది. ఫామ్‌లో ఉన్న సాయివికాస్‌ రెడ్డి (4) త్వరగా వెనుదిరగడంతో జట్టు కాస్త కంగారుపడింది. షణ్ముఖ క్యాచ్‌ పడిపోయిన తర్వాత అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాడి మోడ్‌లోకి వెళ్లాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 56/1గా నిలిచింది. మధ్య ఓవర్లలో వేద్‌ రెడ్డి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా, అభిరథ్‌, తర్వాత వైష్ణవ్‌ జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని సులభం చేశారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన అభిరథ్‌ రెడ్డి ఫీల్డింగ్‌ ఎంచుకోగా, హైదరాబాద్‌ బౌలర్లు అతని నిర్ణయాన్ని సమర్థించేలా బౌలింగ్‌ చేశారు. ఖమ్మం ఏసెస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. మికిల్‌ జైస్వాల్‌ 39 బంతుల్లో 65 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. హిమతేజ 31 పరుగులతో జట్టును నిలబెట్టాడు. చివర్లో విద్యానంద 20 నాటౌట్‌ చేసి స్కోరును 150 దాటించాడు.

హైదరాబాద్‌ బౌలర్లలో స్పిన్నర్‌ యశ్వీర్‌ గౌడ్‌ 4 ఓవర్లలో 17 పరుగులకే 3 వికెట్లు తీసి ఖమ్మం ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు. పేసర్‌ దేవ్‌ మెహతా 2/25, అజయ్‌దేవ్‌ గౌడ్‌ 2/36, అఖిల్‌ 1/14తో సహకరించారు. ఒక దశలో 120/3తో కనీసం 170 పరుగులు చేసేలా కనిపించిన ఖమ్మం, యశ్వీర్‌ కీలక వికెట్లు తీయడంతో చివర్లో పరుగుల వేగాన్ని కోల్పోయింది.

ఫైనల్‌ అనంతరం హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డికి టీజీ20 కప్పును తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, టీజీ20 ఛైర్మన్‌ ఆగంరావు, రామోజీ గ్రూప్‌ సంస్థల సీఎండీ సీహెచ్‌ కిరణ్‌, మార్గదర్శి ఎండీ సీహెచ్‌ శైలజా కిరణ్‌, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ సాంబశివరావు, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, ఈటీవీ డైరెక్టర్‌ సుజయ్‌, రామోజీ టూరిజం గేట్‌వే డైరెక్టర్‌ కీర్తి సోహన, దివిజ తదితరులు పాల్గొన్నారు.

విజేత హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌కు రూ. కోటి ప్రైజ్‌మనీ, రన్నరప్‌ ఖమ్మం ఏసెస్‌కు రూ. 50 లక్షలు అందజేశారు. ఈ మ్యాచ్‌కు టీజీ20 బ్రాండ్‌ అంబాసిడర్‌ విజయ్‌ దేవరకొండ, తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్‌ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

టోర్నీలో వ్యక్తిగత పురస్కారాల్లో అభిరథ్‌ రెడ్డి దుమ్మురేపాడు. పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ, ఆరెంజ్‌ క్యాప్‌ (549 పరుగులు), సూపర్‌ ఫోర్లు (58), సూపర్‌ సిక్సర్లు (33) విభాగాల్లో అతడు అవార్డులు అందుకున్నాడు. పర్పుల్‌ క్యాప్‌ను 21 వికెట్లు తీసిన అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌) కైవసం చేసుకున్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా గణేశ్‌ గడుగు (హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌) నిలిచాడు.

ఇతర విభాగాల్లో తన్మయ్‌ అగర్వాల్‌ (కరీంనగర్‌ డైమండ్స్‌) అత్యధిక శతకాలతో, మికిల్‌ జైస్వాల్‌ (ఖమ్మం ఏసెస్‌) ఉత్తమ క్యాచ్‌, ఇంక్రెడిబుల్‌ మొమెంట్‌ అవార్డులు, వేద్‌ రెడ్డి (ఖమ్మం, 15 వికెట్లు) ఎమర్జింగ్‌ ప్లేయర్‌, అమన్‌ రావు (వరంగల్‌ వారియర్స్‌, స్ట్రైక్‌ రేట్‌ 245.45) సూపర్‌ స్ట్రైకర్‌, హిమతేజ కొడిమెల (ఖమ్మం) గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ద టోర్నీగా ఎంపికయ్యారు. టోర్నీలో మొత్తం 10 శతకాలు, 52 అర్ధసెంచరీలు, 592 సిక్సర్లు నమోదయ్యాయి.

జట్టులో ప్రతి ఒక్కరూ ఈ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. మాలాంటి కుర్రాళ్లు ప్రతిభ చాటుకోవడానికి టీజీ20 గొప్ప వేదికగా నిలిచింది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన మా జట్టుకు క్వాలిఫయర్‌-1లో ఓటమి మంచే చేసింది. చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని ఉత్తమ ప్రదర్శనతో తర్వాతి రెండు మ్యాచ్‌లూ నెగ్గి ట్రోఫీని సొంతం చేసుకున్నాం

అని హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి పేర్కొన్నాడు.