పరాగ్వేపై అమెరికా ఘన విజయం: ఫిఫా ప్రపంచకప్‌లో 4-1తో దుమ్మురేపిన యుఎస్‌

ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న దేశాల్లో ఒకటైన అమెరికా, టోర్నమెంట్‌ను ఘనంగా ఆరంభించింది. టోర్నీ చరిత్రలోనే తన అతి పెద్ద విజయాన్ని నమోదు చేస్తూ, తొలి మ్యాచ్‌లోనే పరాగ్వేపై 4-1 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆరంభం నుంచి ముగింపు వరకు అమెరికా జట్టు ఆధిపత్యం చలాయించగా, స్టేడియంలో హాజరైన వేలాది మంది అభిమానులను ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో అమెరికా తరఫున ఫోలరిన్‌ బలోగన్‌ రెండు గోల్స్‌ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అమెరికాకు తొలి గోల్‌ మాత్రం ఆ జట్టు ఆటగాడు కాకుండా పరాగ్వే ప్లేయర్‌ నుంచి రావడం విశేషంగా మారింది. మ్యాచ్‌ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే పరాగ్వే ఆటగాడు డొమియాన్‌ బొబాడిలా పొరపాటున బంతిని తన సొంత గోల్‌ పోస్టులోకి పంపాడు. దీంతో అమెరికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ప్రథమార్ధంలో అమెరికా జట్టు దూకుడైన ఆటతీరుతో పరాగ్వేపై ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా క్రిస్టియిన్‌ పులిసిచ్‌ తన చురుకైన కదలికలు, పాస్‌లు, దాడులతో ఆకట్టుకున్నాడు. డొమియాన్‌ బొబాడిలాను బోల్తా కొట్టించేలా అతని ఆట సాగింది. మధ్యమైదానంలో పులిసిచ్‌ ఆధిపత్యం కారణంగా అమెరికా దాడులు మరింత పదునుపడ్డాయి.

ఇక ఫోలరిన్‌ బలోగన్‌ 20 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ నమోదు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. 70 వేల మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన స్టేడియంలో అతని గోల్స్‌కు ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించారు. 31వ నిమిషంలో బలోగన్‌ అమెరికా రెండో గోల్‌ సాధించాడు. అనంతరం ప్రథమార్ధం ఇంజురీ టైం ముగియబోతున్న వేళ 45+5వ నిమిషంలో మరో గోల్‌ కొట్టి స్కోరును 3-0కు తీసుకెళ్లాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి అమెరికా తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

ద్వితీయార్ధంలో పరాగ్వే కొంత పుంజుకుంది. అమెరికా రక్షణను దాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫలితంగా 73వ నిమిషంలో పరాగ్వే స్ట్రైకర్‌ మౌరిసియో గోల్‌ సాధించాడు. దీంతో స్కోరు 3-1గా మారింది. ఈ గోల్‌ అనంతరం పరాగ్వే మరిన్ని దాడులు చేసినా, అమెరికా రక్షణ గోడను దాటలేకపోయింది.

90 నిమిషాలు పూర్తయ్యేసరికి అమెరికా 3-1 ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇంజురీ టైంలో కూడా అమెరికా దాడులను ఆపలేదు. చివరికి 90+8వ నిమిషంలో జియోవని రేనా గోల్‌ సాధించాడు. ఈ గోల్‌తో అమెరికా ఆధిక్యం మరింత పెరిగి 4-1గా నిలిచింది. ఈ విజయంతో యుఎస్‌ జట్టు టోర్నమెంట్‌లో బలమైన సందేశం ఇచ్చినట్టైంది.