శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ , ఎంపీ B K పార్థసారథి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఎంజీఎం మైదానంలో నూతనంగా నిర్మించిన ఈ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ , ఎంపీ B K పార్థసారథి తో కలిసి స్టేడియంలో సరదాగా సెటిల్ ఆడారు. బాలయ్య ఆటతీరు, వారి మధ్య జరిగిన సరదా క్రీడా పోటీ అభిమానులను ఉత్సాహపరిచింది. స్టేడియం ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా వేదికలు అవసరమని పేర్కొన్నారు. హిందూపురం యువతకు మెరుగైన క్రీడా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

యువతకు సెటిల్ కాక్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో శిక్షణ అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. క్రీడల ద్వారా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

హిందూపురం పట్టణంలో ఇంత పెద్ద స్థాయిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటవడం స్థానిక క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తమవుతుందనే అభిప్రాయం క్రీడా వర్గాల్లో వ్యక్తమవుతోంది. వివిధ క్రీడా విభాగాలకు అనుగుణంగా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం స్టేడియంలో పలు ప్రదర్శన మ్యాచ్‌లు నిర్వహించారు.