రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: హిందూపురం: ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి వచ్చిన రెండు ఆవులను ఈ రైలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. అయితే రైలు సురక్షితంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హిందూపురం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే సమయంలో ఈ సంఘటన జరిగింది. రైలు ముందుభాగానికి ఆవులు ఢీకొనడంతో పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు.
రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. రైలు లోపల నుంచి బయట పరిస్థితిని గమనించే ప్రయత్నం చేశారు. కొంతసేపు రైలు కదలకపోవడంతో ప్రయాణికుల్లో ఉత్కంఠ నెలకొంది. సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలును బయట నుంచి క్షుణ్ణంగా పరిశీలించారు. రైలు ఇంజిన్ భాగంలో ఎలాంటి సాంకేతిక లోపాలు, నష్టం జరిగిందా అనే దానిపై అధికారులు దృష్టి సారించారు.
ఢీకొన్న రెండు ఆవుల కళేబరాలను రైల్వే పట్టాలపై నుంచి తొలగించారు. అనంతరం రైలు పూర్తిగా సురక్షితంగా ఉందని అధికారులు నిర్ధారించారు. ఎలాంటి ప్రమాద సూచనలు లేవని తేలడంతో రైలును ముందుకు సాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు అరగంట పాటు నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనంతరం తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఘటనలో రైలు ప్రయాణికులు సహా ఎవరికి ఎలాంటి హాని జరగలేదని రైల్వే వర్గాలు తెలిపాయి.













