రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పాత పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, అరెస్టు పెండింగ్‌లో ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఎస్పీ సూచించారు. కేసు డైరీలు, రికార్డులు, గణాంకాలను ఎప్పటికప్పుడు నవీకరించి, దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించినట్లు సమాచారం.
రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. చోరీలు, ఆస్తి సంబంధిత నేరాల నివారణకు రాత్రి గస్తీ, వాహన తనిఖీలను ముమ్మరం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు ప్రణాళికతో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. విగ్రహ ప్రతిష్ఠాపన ప్రాంతాలు, నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్థం నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి సంబంధిత అధికారులతో సమన్వయం పెంచాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. అవసరమైన చోట్ల ముందస్తు చట్టపరమైన చర్యలు, బైండ్‌ఓవర్ ప్రొసీడింగ్స్ చేపట్టి, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
“తప్పు చేయాలంటే నేరస్తుల్లో వణుకు పుట్టాలి.. నేరస్తులకు చట్టం పట్ల భయం, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా పనిచేయాలి” అని ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ స్పష్టం చేశారు.













