పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ సూట్‌కేస్‌ ఘటన:

చెన్నై పోలీసుల దర్యాప్తులో భయానక నిజాలు

చెన్నై పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసులో దొరికిన మృతదేహం కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. ప్లాట్‌ఫారమ్‌పై వదిలిపెట్టిన సూట్‌కేసులో తల, చేతులు, కాళ్లు లేని కుళ్లిపోయిన మొండెం మాత్రమే దొరకడంతో ఈ కేసు మొదట్లో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మృతదేహం గుర్తింపు, హత్యకు గల కారణాలపై చెన్నై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.

మృతదేహంపై ఉన్న బ్రాండెడ్‌ దుస్తుల బార్‌కోడ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. ఆ బార్‌కోడ్‌ ద్వారా సంబంధిత దుస్తులను విక్రయించిన షాపును గుర్తించారు. అక్కడి వివరాల ప్రకారం ఆ దుస్తులను ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్టు బయటపడింది. అనంతరం కాల్‌ డేటా రికార్డులు, వాట్సాప్‌ లోకేషన్‌ వివరాలను విశ్లేషించిన పోలీసులు నిందితులు తేనాంపేట, టి.నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు.

పోలీసుల విచారణలో మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన అమీర్‌ అలీ అని తేలింది. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహం కాగా, ఆమెకు ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్‌ అలీని రెండోసారి వివాహం చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్‌ రోడ్‌ హౌసింగ్‌ బోర్డు క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.

అయితే అమీర్‌ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయని దర్యాప్తులో బయటపడింది. ఈ నేపథ్యంలో రోకిమాకు టి.నగర్‌లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాం వ్యక్తి అష్రఫ్‌ (31)తో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అష్రఫ్‌కు చెప్పడంతో, ఇద్దరూ కలిసి అమీర్‌ అలీని హత్య చేయాలని పథకం వేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఆ పథకం ప్రకారం రాత్రి అమీర్‌ అలీ నిద్రలో ఉండగా రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్‌ కలిసి అతని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అతని తల, చేతులు, కాళ్లను వేర్వేరుగా ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి కవర్‌లో చుట్టి సూట్‌కేసులో పెట్టారు. జూన్‌ 5వ తేదీ రాత్రి రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్‌కేసును పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌లో వదిలేశారు.

నరికిన చేతులు, కాళ్లను నగర పరిసరాల్లోని ఒక కాలువలో పారవేసినట్టు, తలను చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టినట్టు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం అమీర్‌ అలీ స్వయంగా పెట్టినట్లుగా చూపించేందుకు, “ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు” అనే భావంతో హిందీలో నకిలీ సందేశాన్ని అతని Facebook ఖాతాలో రోకిమా పోస్టు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అమీర్‌ అలీ మానసిక క్షోభతో ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసినట్టు కూడా విచారణలో బయటపడింది.

ఈ కేసులో కీలక ఆధారాలుగా నిలిచిన దుస్తుల బార్‌కోడ్‌, డిజిటల్‌ ఫుట్‌ప్రింట్లు, సోషల్‌ మీడియా కార్యకలాపాల ఆధారంగా చెన్నై పోలీసులు నిందితులపై పట్టు బిగించారు. పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ సూట్‌కేస్‌ ఘటన వెనుక ఉన్న కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం, క్రూర హత్య వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.