రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
ప్రారంభానికి సిద్ధం అవుతున్న ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్
వైఎస్ఆర్ కడప: జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా, రాష్ట్రానికి స్ఫూర్తిదాయక నమూనాగా రూపుదిద్దుకుంటున్న “స్టార్ట్ అప్ కడప” ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప నగరంలో పి4 విధానం ద్వారా వినూత్నంగా నిర్మాణం జరుగుతున్న “స్టార్ట్ అప్ కడప” ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావులేకుండా ముందుకు సాగాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
బాహ్య నిర్మాణం పూర్తయిన వెంటనే ఇంటీరియర్ మౌలిక సదుపాయాల ఏర్పాటును కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలను ఆయన సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఇంటి నుండి ఒక స్టార్ట్ అప్ వెలువడేలా చేయాలన్న దిశగా జిల్లా యంత్రాంగం రూపొందించిన సూపకల్పన ప్రతి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. “స్టార్ట్ అప్ కడప” కార్యక్రమాన్ని ఆకాంక్ష జిల్లా కడపలో ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.“స్టార్ట్ అప్ కడప” ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ ద్వారా యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కలెక్టర్ తెలిపారు. కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్ కడప కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా, యువత కలలకు రూపురేఖలు ఇచ్చే వేదికగా, ఆవిష్కరణ, ఆధునికత, అభివృద్ధికి దిక్సూచిగా నిలిచేలా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా పరిపాలన భావిస్తోంది.







