రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్ డి) బోధి పెవిలియన్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం సంబంధిత అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులకైనా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా టెండర్లు పిలవవద్దని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక అధికారిని నియమించిన విషయాన్ని సమావేశంలో వివరించారు.
అలాగే జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రాజెక్టుల అనుమతులు వేగంగా లభించేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమతుల ప్రక్రియలో ఆలస్యం లేకుండా, అభివృద్ధి పనులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు సూచనలు చేశారు.
సైబరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం, దానికి సంబంధించిన జంక్షన్ అభివృద్ధి పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) వెంటనే వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విగ్రహం చుట్టూ ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా జంక్షన్ రూపకల్పన చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (NIUM) నూతన భవన నమూనాతో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. భవనాల నిర్మాణ రూపకల్పన, అందులో ఉండే సౌకర్యాలపై అధికారులతో చర్చించి, పలు విలువైన సూచనలు చేశారు.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించినట్లు సమావేశం అనంతరం అధికార వర్గాలు వెల్లడించాయి.







