హైదరాబాద్: గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై కాంగ్రెస్, BRS నేతల మధ్య సవాళ్లు–ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో గన్ పార్క్, తెలంగాణ భవన్ పరిసరాల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

BRS నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ విసిరిన సవాల్‌పై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రబాకర్, అడ్లూరి లక్ష్మణ్, మొహమ్మద్ అజారుద్దీన్‌లు గన్ పార్క్ దగ్గర బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌పై చర్చించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

హరీష్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్న సమయంలో అక్కడ హై టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. భవన్ పరిసరాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వైపు వెళ్తున్న BRS కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

చర్చకు వెళ్తుండగా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో హరీష్ రావు కిందపడిపోయారు. తమ నేతను అడ్డుకోవడంపై BRS శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రులు పొన్నం ప్రబాకర్, అడ్లూరి లక్ష్మణ్, మొహమ్మద్ అజారుద్దీన్‌లు BRS నేతలు KTR, హరీష్ రావులకు సవాల్ విసిరారు. గన్ పార్క్ దగ్గర తాము సిద్ధంగా ఉంటామని ప్రకటించారు.

మంత్రుల సవాల్‌ను హరీష్ రావు స్వీకరించారు. గన్ పార్క్ దగ్గరికి తామే వస్తామని ప్రకటించిన ఆయన, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, చర్చ నుంచి పారిపోవద్దని మంత్రులకు సవాల్ విసిరారు. అయితే గన్ పార్క్ వద్ద సమావేశానికి అనుమతి లేకపోవడంతో హరీష్ రావును అక్కడికి వెళ్లనీయకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ భవన్, గన్ పార్క్ పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది. రెండు వర్గాల కార్యకర్తలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు.