రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం అయిన ఘటన కలకలం రేపింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణికులు ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసులు, ఆర్టీసీ వర్గాల సమాచారం ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్ కోసం బయలుదేరింది. మార్గమధ్యంలో తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపానికి రాగానే బస్సు వెనుక భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డుపక్కకు ఆపి, ప్రయాణికులను కిందకు దింపాడు.
బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులు ఒక్కొక్కరుగా కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు ఒక్కసారిగా బస్సు అంతటా వ్యాపించాయి. కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా మంటల ముప్పేటలో చిక్కుకుని దగ్ధమైంది. మంటలు ఎగసిపడటంతో అక్కడికక్కడే ఆందోళనకర వాతావరణం నెలకొన్నా, అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడటం స్థానికులకు, ఆర్టీసీ సిబ్బందికి ఊరట కలిగించింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం అదృష్టకరమని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎలక్ట్రిక్ బస్సు కావడంతో సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన కారణం వెలుగులోకి రావడానికి సంబంధిత విభాగాలు దర్యాప్తు చేపట్టాయి. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ఆర్టీసీకి లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఘటనతో కొంతసేపు ఆ మార్గంలో వాహన రాకపోకలు మందగించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు. ప్రయాణికులను అక్కడి నుంచి మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు ఆర్టీసీ అధికారులు చేశారు. పెను ప్రమాదం తప్పించుకున్నామని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.







