రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసించిన తర్వాత విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేందుకు, విద్యా రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
“టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” కార్యక్రమం కింద ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి గురువారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ దాశరథి ఆడిటోరియంలో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







