గోల్కొండ మైనారిటీ హాస్టల్‌లో అమానుషం

పుట్టిన బిడ్డను హత్య చేసిన ఇంటర్ విద్యార్థిని

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన అమానుష ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన ఒక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, క్షణికావేశం, అవమాన భయంతో పుట్టిన నవజాత శిశువును హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గోల్కొండ పరిధిలోని ఒక మైనారిటీ ప్రభుత్వ వసతి గృహంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు, వసతి గృహ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సదరు యువతి గోల్కొండ ప్రాంతంలోని మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఎవరికీ అనుమానం రాకుండా హాస్టల్‌లోని బాత్రూంకు వెళ్లిన ఆమె అక్కడే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.

పుట్టిన వెంటనే ఆ శిశువు ఏడుపు బయటకు వినిపిస్తే తన గర్భం విషయం బయటపడిపోతుందనే భయంతో విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురైందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మానవత్వం మరచి, పుట్టిన కొద్దిసేపటికే శిశువు ఏడుపు ఆపేందుకు అతని ముక్కు, నోరు గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి బాత్రూంలోనే ప్రాణాలు తీశిందని దర్యాప్తులో బయటపడింది.

శిశువు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత, మృతదేహాన్ని ఎలా తొలగించాలన్న ఆలోచనలో మరో దారుణానికి ఒడిగట్టింది. హాస్టల్ భవనంలోని మూడో అంతస్తు కిటికీ ద్వారా పక్కనే ఉన్న ESI Dispensary ఆవరణలోకి ఆ నవజాత శిశువు మృతదేహాన్ని విసిరేసింది. గురువారం ఉదయం డిస్పెన్సరీ ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉన్న గుర్తుతెలియని శిశువు మృతదేహాన్ని గమనించిన ESI సిబ్బంది, హాస్టల్ ప్రిన్సిపాల్ వెంటనే గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం హాస్టల్, ESI ఆవరణలో ఉన్న CCTV Footage ను నిశితంగా పరిశీలించగా, భవనం పై అంతస్తు నుంచి ఏదో వస్తువు కింద పడిన దృశ్యాలు కనిపించాయి. దీనిని ఆధారంగా తీసుకుని హాస్టల్‌లోని విద్యార్థినుల హాజరు, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన పోలీసులు, అనుమానాస్పదంగా కనిపించిన ఆ ఇంటర్ విద్యార్థినిని విచారణకు తీసుకున్నారు.

మొదట విచారణలో తడబడిన ఆమె, చివరికి ఒత్తిడికి లోనై జరిగిన విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన మేనబావ వరుసయ్యే వ్యక్తి వల్ల గర్భం దాల్చిన విషయాన్ని, ఇది ఇంట్లో తెలిసితే అవమానమనే భయంతో ఇన్నాళ్లూ గర్భాన్ని దాచుకున్నట్లు ఆమె వెల్లడించినట్టు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ప్రసవం జరిగిన వెంటనే భయంతోనే బిడ్డను చంపి, మూడో అంతస్తు నుంచి విసిరేసినట్లు ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

ప్రసవం కారణంగా, తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆ విద్యార్థినిని పోలీసు భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన, బాలికను గర్భవతిని చేసిన మేనబావపై గోల్కొండ పోలీసులు POCSO చట్టం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి అరెస్టు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.