హైదరాబాద్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ పాతబస్తీలోని సైదాబాద్‌ వాణీనగర్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం.

వివరాల్లోకి వెళ్తే, వాణీనగర్‌కు చెందిన రిటైర్డ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ షేక్‌ అబ్దుల్‌ సయ్యద్‌ కుమారుడు నవీద్‌ (47) గత కొంతకాలంగా అమెరికాలోని మార్క్ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహ నహీం షేక్‌ (19), కుమారుడు హఫీజ్‌ ఒమర్‌ (14), చిన్న కుమార్తె ఖతిజా షేక్‌ (8)తో కలిసి కారులో San Jose పట్టణం నుంచి నెవాడా రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్నారు.

ఈ ప్రయాణంలో నజియా సల్మా నడుపుతున్న కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టినట్లు అక్కడి సమాచారం. ఢీకొన్న ప్రభావంతో నజియా సల్మా, నేహ నహీం షేక్‌, హఫీజ్‌ ఒమర్‌తో పాటు మరో కారులోని డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న అబ్దుల్‌ నవీద్‌, ఖతిజా షేక్‌ (8)లను కాలిఫోర్నియాలోని ఒక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

అమెరికాలో జరిగిన ఈ విషాదకర ఘటన సమాచారం వాణీనగర్‌కు చేరడంతో అక్కడి బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంటి వద్ద శోకసంద్రం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు చేరుకున్నారు.

యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, MBT నేత అమ్జాదుల్లా ఖాన్‌తో పాటు ఇతర మైనారిటీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. మృతుల కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించేలా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.

నవీద్‌ తండ్రి అబ్దుల్‌ సయ్యద్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తాము కాలిఫోర్నియాకు వెళ్లేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అప్పటి వరకు మృతదేహాలను భద్రంగా ఉంచేలా చూడాలని, అనంతరం వాటిని హైదరాబాద్‌కు రప్పించేందుకు అవసరమైన సహాయం అందించాలని ఆయన కోరారు.