రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: లవర్ బాయ్, పక్కింటి కుర్రాడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నాని, ‘దసరా’తో తనలోని మాస్ కోణాన్ని కొత్తగా చూపించాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెలతో ఆయన హిట్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ట్రైలర్ లేకుండా, కేవలం కంటెంట్‌పై నమ్మకంతో నేరుగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించింది అన్నదే ఇప్పుడు చర్చ.
రెండు వేల కిలోమీటర్లు నడిచి వచ్చి ‘ప్యారడైజ్’ ప్రాంతంలో స్థిరపడిన ఏడు వేల మందితో కూడిన సమూహం పేరు సవారీలు. దేశం కోసం పోరాడిన కుటుంబాలు అందులో ఉన్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఎవరికీ గుర్తింపు లేదు. తరాలుగా ఆ గుర్తింపుకోసమే పోరాటం సాగుతుంది. ఏడు వేల మంది ఐదు వేల మందికి తగ్గినా, అధికారిక గుర్తింపు మాత్రం దక్కదు.
శిఖంజా మాలిక్ (మోహన్‌బాబు) కుటుంబం తరాలుగా సవారీలను చిన్నచూపు చూస్తూ అణగదొక్కుతుంది. ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంది. మాలిక్ కుటుంబం భయంతో సవారీలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావు. వైద్యం, విద్య, ఉపాధి అన్నింటి నుంచి దూరమవుతారు. గత్యంతరం లేక దొంగతనాలు, సారా తయారీతో జీవనం కొనసాగిస్తారు.
మాలిక్ చిత్రహింసల మధ్యే కవలలకు జన్మనిచ్చిన సమ్మక్క (సోనాలి కుల్‌కర్ణి), తన కొడుకు జడల్ (నాని) సవారీలకు నాయకుడై జాతికి గుర్తింపు తెస్తాడని ఆశపడుతుంది. తల్లితో విభేదాలు ఉన్న జడల్ నిజంగా నాయకుడయ్యాడా? తన జాతికి గుర్తింపు సాధించాడా? అతనికి ‘జడల్’ అనే పేరు ఎలా వచ్చిందీ, చిన్న వయసులోనే జైలుకు ఎందుకు వెళ్లాడీ, తిరిగి వచ్చాక ఏం చేశాడీ వంటి అంశాలు తెరపై ఆవిష్కరించబడతాయి. జడల్‌కు మనసిచ్చిన సుబ్బు (కయాదు లోహర్) పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది.
“ఈ జీవితమంతా పోరాటానిది, వచ్చే జన్మ మనది” అనే భావాన్ని కేంద్రంగా పెట్టుకుని తల్లీకొడుకుల బంధం, జాతి గుర్తింపుకోసం చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. కథ, కథనాల కంటే థియేట్రికల్ అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిత్రం దృశ్యపరంగా, సంగీతపరంగా గట్టి ముద్ర వేస్తుంది. సవారీల అట్టడుగు జీవన శైలిని చూపిస్తూ, ప్యారడైజ్ ప్రపంచంలో ప్రేక్షకుడిని లీనం చేస్తుంది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా కనిపించేలా సాయి కెమెరా పని చేసింది. అనిరుధ్ రవిచందర్ పాటలు, ముఖ్యంగా ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలు థియేటర్లను ఊపేస్తాయి.
ఇక నాని విషయానికి వస్తే, ఇంతవరకు నేచురల్ స్టార్‌గా అలరించిన ఆయన, ఇక్కడ ‘షేర్ నాని’గా విరుచుకుపడ్డాడు. జడలు, పచ్చబొట్టు లుక్‌తో, చొక్కా విప్పేసి చేసే యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. గన్స్ పేల్చడం, కత్తులతో రక్తం ఏరులై పారేలా పోరాటాలు చేయడం వంటి హై వోల్టేజ్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే సంభాషణల విషయంలో ఇంకాస్త పదును అవసరమని అనిపిస్తుంది.
మోహన్‌బాబు పోషించిన శిఖంజా మాలిక్ పాత్ర ప్రథమార్థంలో బలంగా నిలుస్తుంది. ఆయన డైలాగ్ డెలివరీ, తెరపై కనిపించిన తీరు వింటేజ్ మోహన్‌బాబును గుర్తు చేస్తాయి. జూనియర్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ నటన బాగుంది. సోనాలి కుల్‌కర్ణి, ఈశ్వరీ రావు పాత్రలు, వారి నటన మెప్పిస్తాయి. బిరియానీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో సంపూర్ణేశ్‌బాబు హాస్యంతో అలరిస్తాడు. కయాదు లోహర్ చుక్కలాంటి అందంతో ఆకట్టుకున్నా, హీరో–హీరోయిన్ మధ్య ప్రేమకథ మాత్రం అంతగా పండలేదు.
సవారీల నేపథ్యాన్ని పరిచయం చేసే సన్నివేశాలతో సినిమా బలంగా మొదలవుతుంది. జైలు ఫైట్, జడలు–పచ్చబొట్టు వెనక కథను చూపించే భాగాలు ప్రథమార్థానికి ప్రధాన ఆకర్షణ. అయితే తొలి అరగంట తర్వాత కథనం కాస్త గాడి తప్పుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జడల్ ట్రాక్, ప్రేమసన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపవు. విరామానికి ముందు తల్లీకొడుకుల భావోద్వేగ సన్నివేశాలు మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ద్వితీయార్థంలో శిఖంజా మాలిక్ బయటకు రావడం, జడల్‌తో తలపడే సన్నివేశాలపై ప్రేక్షకుల్లో కుతూహలం పెరుగుతుందేమో గానీ, ఆ అంచనాలకు తగ్గట్టుగా కథనం సాగదు. ఒకే పార్శ్వంతో కూడిన కథ, కొత్తదనం లేని కథనాలు కారణంగా రెండో భాగం ఎక్కువగా పోరాట సన్నివేశాలతో నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. హింస, రక్తపాతం అధికంగా ఉండడం కొంతమందికి అసౌకర్యంగా అనిపించొచ్చు.
ఎమ్మెల్యే శంకర్ (ప్రియదర్శి)గా కేసీఆర్‌ను పోలిన పాత్ర ప్రవేశంతో తెరపై మళ్లీ సందడి మొదలవుతుంది. ముఖ్యమంత్రి వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు, కేసీఆర్ ప్రసంగాలను తలపించే సంభాషణలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన భాగాలు సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తాయి. రియల్ టైమ్ రాజకీయ అంశాలను కథతో ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.
ప్రొడక్షన్ డిజైన్ విభాగం పనితనం ప్రశంసనీయంగా ఉంది. ప్యారడైజ్ సెటప్ దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల కృత్రిమంగా అనిపిస్తుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రథమార్థంలో బాగున్నా, ద్వితీయార్థంలో వట్టి శబ్దాలే ఎక్కువగా వినిపించడం వల్ల కొన్ని చోట్ల సంభాషణలు స్పష్టంగా వినిపించవు. భావోద్వేగాలు కూడా పూర్తిగా పండకపోవడం కథకు మైనస్.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన విజన్‌కు తగ్గట్టుగా, రాజీ పడకుండా భారీ స్కేల్ సన్నివేశాలు తెరపై చూపించారు. కొన్ని భాగాల్లో బలమైన పట్టు కనబరిచినా, మొత్తం కథ–కథనాల విషయంలో ఆయన కసరత్తులు సరిపోలలేదు. పలు సినిమాల మిశ్రమంలా అనిపించే కథ, కొరవడిన భావోద్వేగాలు, మితిమీరిన రక్తపాతం కారణంగా ‘ది ప్యారడైజ్’ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.
మొత్తానికి, నాని మాస్ అవతారం, విజువల్స్, పాటలు, ప్రథమార్థం ఈ చిత్ర బలాలు. బలహీనతలుగా కథ, కథనాలు, భావోద్వేగాల లోపం, అధిక హింస నిలిచాయి. మాస్ యాక్షన్, రక్తపాతం ప్రధానంగా ఉండే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ది ప్యారడైజ్’ ఒకసారి చూడదగ్గ యాక్షన్ థ్రిల్లర్.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 2.5/5







