రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం
20 వేలమంది అభ్యర్థుల పరీక్షలు వాయిదా
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 20 వేలమంది అభ్యర్థులకు నిర్వహించాల్సిన ఆన్‌లైన్ పరీక్షలు, ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంస్థ తెలియజేసింది. కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్లు, ఒకరి స్థానంలో మరొకరు పరీక్షలు రాసినట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ట్రైనీ , డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత, నిజాయితీపై ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఇన్ఫోసిస్ తన భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసింది. పరీక్షల నిర్వహణలో కొత్త నియమాలు, అదనపు భద్రతా చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మార్పుల కారణంగా ముందుగా షెడ్యూల్ చేసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఇన్ఫోసిస్ అభ్యర్థులకు ఇమెయిల్‌ల ద్వారా సమాచారం పంపింది. తాత్కాలిక వాయిదా వల్ల సంస్థ భవిష్యత్తు రిక్రూట్మెంట్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రతిభావంతులైన యువతను నియమించుకోవాలనే తన కట్టుబాటు కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అవసరాల కోసం ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు అనే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా దాదాపు 1.5 కోట్ల మంది వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు. గతంలో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నియామకాలు చేపట్టిన ఇన్ఫోసిస్, నకిలీ ప్రొఫైళ్లు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో గత ఏడాది నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపిన హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తోంది.
టాలెంట్ నిరూపించుకోలేని అభ్యర్థుల విషయంలో సంస్థ కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు గత ఘటనలు సూచిస్తున్నాయి. మైసూర్ క్యాంపస్‌లో అంతర్గత పరీక్షల్లో మూడు సార్లు విఫలమైన 600 మంది ట్రైనీలను గత ఏడాది సంస్థ నుంచి పంపించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోసిస్ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్‌ను దరఖాస్తుల సంఖ్య స్పష్టంగా చూపిస్తోంది. ఆర్థిక సంవత్సరం FY26లో సంస్థకు 58 లక్షల దరఖాస్తులు అందాయి. వీరిలో 4 లక్షల 50 వేల 901 మందిని ఇంటర్వ్యూకు పిలిచి, 87 వేల 286 మందికి ఉద్యోగ ఆఫర్లు జారీ చేసింది. క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో కూడా ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. FY26లో 20 వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకున్న ఈ సంస్థ, FY27లో కూడా ఇదే స్థాయిలో రిక్రూట్మెంట్ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.













