ఆర్టీసీ బస్సుల్లో బంగారం దొంగతనాలు

ముగ్గురు మహిళల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సీట్లు దొరకడం దూరం, నిల్చునే చోటుకూడా తావులేని స్థితి నెలకొంది. ఈ రద్దీని కొందరు నేరస్తులు అవకాశంగా మలుచుకుని చేతివాటం చూపడం ప్రారంభించారని పోలీసులు చెబుతున్నారు.

ముఖ్యంగా మహిళలతో కూడిన గ్యాంగులు బస్సుల్లో తిరుగుతూ మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు దోచుకుంటున్నాయని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. తిరుమల, పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు పెరిగిన నేపథ్యంలో మహిళా ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళల గ్యాంగ్‌ను పాకాల పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. సాధారణ ప్రయాణికుల్లా కలిసిమెలిసి మాట్లాడి నమ్మకం కలిగించి, గుంపులోని రద్దీని ఉపయోగించుకుని తెలియకుండా చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.

ఈ లేడీ బ్యాచ్‌ నుంచి సుమారు రూ.3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు, హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలు మాయమవుతున్నాయనే ఫిర్యాదులు వరుసగా రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శంఖంపల్లి ఫ్లై ఓవర్ వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో జి.దివ్య (31), బి.రాధిక (38), బి.మేరి (33)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. గతంలో వీరు మరెన్ని దొంగతనాల్లో పాల్గొన్నారన్నది రిమాండ్‌లో విచారణ ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.

ఇకపై రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ ఆభరణాలు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులను ప్రత్యేక జాగ్రత్తతో కాపాడుకోవాలని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల గురించి వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.