రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి:- సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టులో సోమవారం ప్రైవేటు కేసు దాఖలైంది. ఈ కేసును భాజపా సీనియర్ నేత, తితిదే పాలకమండలి సభ్యుడు జి. భానుప్రకాష్‌రెడ్డి తన న్యాయవాది కొత్తపల్లి అజయ్‌కుమార్ ద్వారా దాఖలు చేశారు.
గతంలో ఇదే అంశంపై న్యాయవాది ద్వారా ప్రకాశ్‌రాజ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నోటీసుల అనంతరం కూడా సమస్య పరిష్కారమవకపోవడంతో కోర్టు శరణు వెళ్లినట్లు భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రకాశ్‌రాజ్ హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు, లక్ష్మణులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పిటిషన్‌లో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, మత భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196 కింద కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. ఈ సెక్షన్ ప్రకారం మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష లేదా ఇతర ప్రాతిపదికలపై వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, సామరస్యానికి భంగం కలిగించడం నేరంగా పరిగణించబడుతుంది.
అలాగే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 కింద కూడా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ సెక్షన్ ప్రకారం ఒక నిర్దిష్ట మతవర్గం మనోభావాలను ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా అవమానించడం నేరంగా పరిగణించబడుతుంది. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
పిటిషన్‌ను స్వీకరించిన తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టు కేసును పరిశీలనలోకి తీసుకుంది. తదుపరి విచారణ తేదీ, తదనుగుణ చర్యలపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి.
ఈ కేసు దాఖలుతో సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై మరోసారి న్యాయపరమైన వివాదం నెలకొన్నది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు విచారణలో ఏ విధమైన నిర్ణయం వెలువడుతుందో చూడాల్సి ఉంది.













