శ్రీసిటీలో రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్‌కు ఆహ్వానం

రష్యాలోని అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు, అగ్రశ్రేణి ప్రపంచ సరఫరాదారు అయిన టాస్మాషుహోల్డింగ్ JSC గ్లోబల్ ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో రైలు తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో రైలు రంగానికి సంబంధించిన కీలక తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని టాస్మాషుహోల్డింగ్ JSC ప్రతినిధులను ఆహ్వానించారు. శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అలస్టమ్ భారీ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకొని ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్‌ను స్థాపించాలనే ప్రతిపాదనను ఆయన ముందుకు తెచ్చారు.

దక్షిణాసియా అంతటా చేపట్టబోయే భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రత్యక్ష రహదారి అనుసంధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్‌లు, బోగీల తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పే అవకాశాలపై కూడా చర్చించారు.

రాష్ట్రంలో రాబోయే మెట్రో నెట్‌వర్క్‌ల అభివృద్ధిలో సాంకేతిక ఏకీకరణ కీలకమని మంత్రి నారా లోకేష్ సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిగ్నలింగ్, ట్రాఫిక్ నియంత్రణ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో టాస్మాషుహోల్డింగ్ JSC భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఆర్ అండ్ డి కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ను రైలు రోలింగ్ స్టాక్, విడిభాగాల తయారీ, స్మార్ట్ సిగ్నలింగ్ సాంకేతికతల కోసం ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ దిశగా అంతర్జాతీయ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రం అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్లు ఆయన సమావేశంలో వివరించారు.