తిరుపతి: రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం అవసరమని కోరుతూ, జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు.

తిరుపతిలో ఎంపీ మద్దిల గురుమూర్తి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ప్రతినిధి బృందం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసింది. ఈ బృందంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు, సత్యవేడు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నూకతోటి రాజేష్, పార్టీ ఎస్సీ విభాగం నాయకులు పాల్గొన్నారు.

తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన సందర్భంగా చేసిన హెచ్చరికలు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాలా నిజమవుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేసే పాలకులు ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, అధికార దుర్వినియోగం జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడతాయని డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్న విషయాలను ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలపై దాడులతో ప్రారంభమైన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో లాకప్ డెత్‌లు పెరుగుతున్నాయని, బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా వారికి న్యాయం అందకుండా వివక్షకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణించడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం వెనుకబడటం, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

పేదల ఇళ్ల కూల్చివేతలు, దళితులపై దాడులు, లాకప్ డెత్‌ల వంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగడం లేదని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీల హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలు సమర్థంగా పనిచేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదని, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనలకు కూడా తగిన స్పందన లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

ప్రశ్నించే జర్నలిస్టులపై కూడా దాడులు జరుగుతున్నాయని, మీడియా స్వేచ్ఛను అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ తన పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తమ వెంట వచ్చిన బాధితుల సమస్యలను జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.