రాయలసీమ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ‘సం క్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకరవర ప్రసాద్‌గారు’ విజయాలతో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి, కథానాయకుడు వెంకటేశ్ మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ కాంబినేషన్‌లో కొత్త మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ మరో కథానాయకుడిగా నటించనున్నారు. ‘పటాస్’ విజయానంతరం అనిల్–కల్యాణ్‌రామ్ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.
సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఈ నెల మూడో వారంలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నెలాఖరు నుంచే రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
వెంకటేశ్ జూలై నెలలో సెట్స్‌లోకి చేరే అవకాశముందని తెలిసింది. అనిల్ రావిపూడి శైలికి అనుగుణంగా వినోదాత్మక కథనంతో పాటు కుటుంబానికి దగ్గరైన భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు కలగలిపిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని సమాచారం. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా హాస్యం, మాస్ ఎలిమెంట్లు సమపాళ్లలో ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటించనున్నారు. స్టార్ కాస్టింగ్, విజయవంతమైన కాంబినేషన్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌ల పాత్రల రూపకల్పన , వారి మధ్య సాగే ట్రాక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సాంకేతిక విభాగం, సంగీత దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. సంక్రాంతి బరిలోకి దిగబోతున్న ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి టాలీవుడ్‌లో పెరుగుతోంది.







