రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
మహిళలపై శతాబ్దాల అణచివేతపై చర్చ
వంట, ఇంటి పనులపై సమాజానికి చిన్మయి సందేశం
పుణె బిజినెస్‌మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో, మహిళలపై జరుగుతున్న హింస, సామాజిక వ్యవస్థపై సోషల్ మీడియాలో చర్చలు మళ్లీ ముదురుతున్నాయి. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రూపొందే కథలపై సినీ ప్రముఖులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను ఒక నెటిజన్ ఇలాంటి ఘటనలపై సినిమా తీయాలంటూ కోరాడు. దీనికి స్పందించిన రాహుల్ సమాధానం, ఆయన భార్య, గాయని చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
మన సొసైటీలో శతాబ్దాలుగా మహిళలను కుంగదీసే ఒక వ్యవస్థ నడుస్తోంది. నా చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు నిశ్శబ్దంగా బాధపడటం నేను చూశాను. అలాంటి ఓ కథనే ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో చూపించాను. ఒకవేళ నాకు ఆసక్తికరంగా అనిపించే కథ ఏదైనా దొరికితే, భవిష్యత్తులో ఒక మహిళ చేసిన నేరం గురించి సినిమా తీస్తానేమో. కానీ, పురుషులపై మహిళలు చేసే నేరాలంటూ జనరలైజ్ చేసి తీయను. నా దృష్టిలో ఆ రెండింటికీ చాలా తేడా ఉంది
అని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. మహిళలపై శతాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేతను చూపించడానికే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ను తెరకెక్కించినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై రాహుల్ భార్య చిన్మయి స్పందించారు. రాహుల్ అందరిలా ఆలోచించరని, అలాంటి దృక్పథం కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఒక పోస్ట్‌కు ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు.
‘అందరికీ వంట చేసే వాళ్లు దొరకరు’ అనే వ్యాఖ్యను ఆ నెటిజన్ కామెంట్‌గా పెట్టాడు. ఈ వ్యాఖ్య చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. ఇంట్లో అమ్మ చేసే వంటను కొందరు చులకనగా చూస్తూ, అవమానకరంగా మాట్లాడే వారున్నారని ఆమె తీవ్రంగా స్పందించారు.
వంటను కేవలం మహిళలకే పరిమితం చేస్తూ, ఇంటి పనులను తక్కువగా చూడటం సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉందని ఆమె సూచించారు. పెద్ద పెద్ద హోటల్స్‌లో చెఫ్‌లు కూడా ఎక్కువగా మగవారే ఉంటారని, వంటను ఒక లింగానికే కట్టిపెట్టే దృక్పథం తప్పని చిన్మయి స్పష్టం చేశారు.
వంట చేయడం ఒక నైపుణ్యం, బాధ్యత మాత్రమేనని, దాన్ని మహిళలకే చెందిన పని అన్నట్టుగా మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. మహిళల పనిని తక్కువ చేసి చూడకూడదన్న సందేశంతో చిన్మయి చేసిన ఈ కౌంటర్ అనేక మందిని ఆలోచనలో పడేసింది.







