రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
మళ్లీ వాయిదా పడిన నాని ‘ది ప్యారడైజ్’.. షూటింగ్ జాప్యమే కారణమా?
నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదల మరోసారి వాయిదా పడినట్లుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పట్టాలెక్కి ఏడాదిన్నర దాటినా, ఈ చిత్రం థియేటర్లకు రావడంలో వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘దసరా’తో మాస్ ఆడియన్స్‌కు దగ్గరైన నాని, ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే స్థాయిలో ప్రభావం చూపేలా ‘ది ప్యారడైజ్’ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నటీనటుల ఎంపిక విషయంలోనే చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వంటి విభిన్నమైన నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మోహన్ బాబు వంటి సీనియర్ నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం, కథకు ఉన్న బలం, వెయిట్‌ను సూచిస్తున్న అంశంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, ‘ది ప్యారడైజ్’కు ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్‌లో ఉందని టాక్. శ్రీకాంత్ ఓదెల ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా మలచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుండటం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటం వల్లే ఈ జాప్యం జరుగుతోందని చెప్పుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే చిత్ర బృందం తొందరపడకుండా ముందుకు సాగుతోందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని భావించగా, తర్వాత ఆగస్ట్‌కు మార్చినట్లు సమాచారం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి మరింత సమయం పడుతుండటంతో, ఇప్పుడు డిసెంబర్‌కు రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సినిమా ఆలస్యమవుతున్నా, నాని మాత్రం ప్రమోషన్ల విషయంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘దసరా’ను పాన్ ఇండియా స్థాయిలో ఎలా మార్కెట్ చేశారో, ‘ది ప్యారడైజ్’ కోసం కూడా అదే స్థాయిలో భారీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ప్రమోషనల్ స్ట్రాటజీతో పాటు గణనీయమైన బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్.
నార్త్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా కంటెంట్‌ను డిజైన్ చేశారని, అందుకే ప్రమోషన్ల విషయంలో నాని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని పర్ఫార్మెన్స్, విభిన్నమైన క్యాస్టింగ్, పక్కా ప్రమోషనల్ ప్లాన్ – ఇవన్నీ కలిసొస్తే ‘ది ప్యారడైజ్’కు మంచి హైప్ క్రియేట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే నాని వేసిన ఈ పాన్ ఇండియా ప్రమోషనల్ ప్లాన్ ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో, డిసెంబర్‌లో విడుదల జరిగితేనే స్పష్టమవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.







