పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ ఒకటి. యుద్ధం నేపథ్యంగా సాగే ప్రేమకథగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి.

ఈ క్రేజీ విజువల్ వండర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. అయితే ‘ఫౌజీ’ రిలీజ్ తేదీ ప్రకటించడంతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK 111’ విడుదలపై అనిశ్చితి నెలకొంది.

వాస్తవానికి దసరా సీజన్‌లోనే ‘NBK 111’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మొదట ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా చిత్ర యూనిట్ అంతర్గతంగా డిసెంబర్ 4న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే అంతకంటే ఒక్క రోజు ముందే, డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’ థియేటర్లలోకి రావడం బాలయ్య సినిమా విడుదల వ్యూహంపై ప్రశ్నార్థకాన్ని సృష్టించింది.

ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా స్టార్ చిత్రం అదే సమయంలో బరిలో ఉండటంతో, ‘NBK 111’కు థియేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, పెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్లలో స్క్రీన్‌ల లభ్యత తగ్గే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఇక ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు పెద్ద సినిమాల విడుదలల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలనే అంతర్గత ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం కూడా ఇప్పుడు బాలయ్య సినిమా ముందుకు రావడంలో పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నియమాన్ని పరిగణనలోకి తీసుకుంటే ‘ఫౌజీ’ తర్వాత కనీసం రెండు వారాల గ్యాప్ ఇచ్చిన తరువాతే ‘NBK 111’ విడుదల కావాల్సి ఉంటుంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘NBK 111’లో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం ‘NBK 111’ టీమ్‌కు అనుకూలంగా మారింది. విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, పరిస్థితిని బట్టి కొత్త తేదీని నిర్ణయించే అవకాశం వారికి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ‘ఫౌజీ’ దూకుడుకు ఎలాంటి బ్రేక్ పడకుండా, బాలయ్య చిత్రాన్ని కొంత వెనక్కి జరిపి కొత్త రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేయాలనే ఆలోచనలో ‘NBK 111’ మేకర్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన కోసం మాత్రం అభిమానులు వేచి చూడాల్సిందే.