ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ నుండి వరుస రిప్లైలు…

ఫ్యాన్స్‌కు వీకెండ్‌ మజా

సోషల్‌ మీడియాలో హీరోల అభిమానుల హడావుడి ఎంత జరిగినా, ఎక్కువ మంది స్టార్‌ హీరోలు మాత్రం పెద్దగా స్పందించరు. అభిమానులు ఎన్ని పోస్టులు పెట్టినా, వారివద్ద నుంచి రిప్లైలు రావడం చాలా అరుదు. వచ్చినా అవి ఎక్కువగా ఆ హీరో సోషల్‌ మీడియా టీమ్‌ నుంచే వస్తాయని అభిమానుల అభిప్రాయం. అయితే ఇప్పుడు స్టార్‌ హీరో NTR ఎక్స్‌ అకౌంట్‌ నుంచి వచ్చిన వరుస రిప్లైలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి, అలరించుతున్నాయి.

నిన్న సాయంత్రం తర్వాత నుంచి NTR ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా కొన్ని పోస్టులకు వరుసగా రిప్లైలు రావడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా జరగడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీనికి కారణం ఎన్టీఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ స్టోరీ. నటనలోనే కాదు, వంట విషయంలో కూడా ఎన్టీఆర్‌కి మంచి ఆసక్తి ఉన్న విషయం అభిమానులందరికీ తెలిసిందే. షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా ఆయన వంటగదిలో గడుపుతాడని, ఆయ బిర్యానీ, నాటు కోడి కూర వంటివాటికి ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా ఫేమస్‌ అయ్యాడు.

ఇలాంటి ఎన్టీఆర్‌ తొలిసారి కుకీస్‌ తయారు చేశాడు. బేకింగ్‌ చేస్తూ తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోను ఆయన సోషల్‌ మీడియా టీమ్‌ ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో కూడా షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌పై అభిమానులు విపరీతంగా కామెంట్లు చేయడం ప్రారంభించారు.

ఆ కామెంట్లలో ఒకటి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీస్‌ పంపించు అన్నా’ అని ఓ అభిమాని రాయగా, ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ నుంచి వెంటనే స్పందన వచ్చింది. బ్రహ్మానందం ఆడియోతో పాటు ‘అడ్రస్‌ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్‌ పెట్టు’ అనే రిప్లై పెట్టారు. దీనితో ఆ కామెంట్‌ చుట్టూ చర్చ మొదలైంది.

ఇంకో అభిమాని అదే వీడియోపై ‘బిర్యానీ, నాటు కోడి ఎక్కడ టైగర్‌.. ఏంటీ కుకీలు..’ అని కామెంట్‌ చేశాడు. దానికి సమాధానంగా ‘బాద్‌షా’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ వీడియోను రిప్లైగా పంపారు. ఆ వీడియోలో వినిపించే మాటలు:

ఈ వరుస రిప్లైలు చూసిన అభిమానులు ఎన్టీఆర్‌ నిజంగానే ఖాళీగా కూర్చొని ఫ్యాన్స్‌ పోస్టులకు కామెంట్లు పెడుతున్నాడా, లేక సోషల్‌ మీడియా టీమ్‌ క్రియేటివ్‌గా వ్యవహరిస్తుందా అని ఆశ్చర్యపోయారు. అయితే ఏదైనా సరే, వీకెండ్‌లో ఇలా వచ్చిన ఫన్నీ రిప్లైలు ఎన్టీఆర్‌ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చాయి. సోషల్‌ మీడియాలో ఈ స్క్రీన్‌షాట్లు విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి.