రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
దసరా బరిలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’… వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోకు రిలీజ్ డేట్ ఖరారు?
టాలీవుడ్‌లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ చిత్రాలకు రచయితగా అద్భుతమైన సంభాషణలు అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు తొలిసారిగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వెంకటేష్ కెరీర్‌లో 77వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే వెరైటీ టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. సంక్షిప్తంగా ‘AK47’గా పిలుస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఒకటిగా మారింది.
ఈ చిత్ర విడుదలపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. రాబోయే దసరా పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని, 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టైటిల్ వినగానే పక్కా ఫ్యామిలీ డ్రామా అనిపించినప్పటికీ, ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషించడం విశేషంగా మారింది.
మొదట ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మధ్యలో నవ్వుతూ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మల్లీశ్వరి’ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత వస్తున్న వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో, టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, దసరా లాంటి పెద్ద హాలిడే సీజన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







