సినీ నటుడు విజయ్ దేవరకొండ తన స్వగ్రామంపై ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల సతీమణి రష్మికతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలోని తన ఇంటికి గృహప్రవేశం చేసిన సందర్భంగా గ్రామంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని ఆయన ఇప్పుడు అమలు చేశారు.

‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అచ్చంపేట డివిజన్‌ విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. సంబంధిత పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు అందించనున్నారు.

విజయ్ దేవరకొండ స్వగ్రామంలోని ZPHS తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అదే పాఠశాలలో 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ మెరిట్ స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులుగా జాబితాలో చోటు దక్కించుకున్నారు.

అచ్చంపేట డివిజన్‌లోని ఇతర ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల నుంచి కూడా 9, 10వ తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉపకారవేతనాలు ఎలా, ఎప్పుడు అందజేస్తారనే వివరాలను ‘ది దేవరకొండ ఫౌండేషన్’ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

తుమ్మన్‌పేట గృహప్రవేశ వేడుక సందర్భంగా ఇచ్చిన మాటను విజయ్ దేవరకొండ నిలబెట్టుకోవడంతో గ్రామస్థులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడిగా బిజీ షెడ్యూల్ మధ్యలో స్వగ్రామ విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనివ్వడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ స్థాపించిన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ గతంలో కూడా విద్య, ఆరోగ్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అచ్చంపేట డివిజన్‌లోని 45 పాఠశాలల విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం ద్వారా ఆ సేవా కార్యక్రమాలకు మరిన్ని కొత్త కోణాలు జోడించినట్టైంది.

ఉపకారవేతనాలకు ఎంపికైన విద్యార్థుల పూర్తి జాబితాను ఫౌండేషన్ అధికారిక వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండపై సోషల్ మీడియా వేదికల్లో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.