కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కడప పార్లమెంట్ సభ్యులు వైయస్‌ అవినాష్‌ రెడ్డి కలిశారు. వైఎస్సార్‌ జిల్లాలో రహదారి అభివృద్ధి, నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం పలు ప్రతిపాదనలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ముద్దనూరు నుంచి కడప వరకూ ఉన్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఎంపీ వివరించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, రహదారి విస్తరణ ద్వారా ప్రయాణ సౌలభ్యం, రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు.

కడప నగరంలో ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి జేఎంజే సర్కిల్‌ వరకూ ఉన్న రహదారిని కూడా నాలుగు లైన్లుగా మార్చాలని వైయస్‌ అవినాష్‌ రెడ్డి కోరారు. ఈ ప్రాంతం నగరంలో కీలక రహదారి కావడంతో, విస్తరణ ద్వారా ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన సూచించారు.

కడప కార్పొరేషన్‌ పరిధిలోని ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి ఐటీఐ సర్కిల్‌ వరకూ పెరిగిన వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని పాదచారుల భద్రత, పార్కింగ్‌ సౌకర్యాల మెరుగుదలపై ఎంపీ దృష్టి సారించారు. ఈ మార్గంలో ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం, ఇంటర్‌లాకింగ్‌ పేవర్‌ బ్లాక్స్‌తో పార్కింగ్‌ సౌకర్యం కల్పించడం, స్టార్మ్‌ వాటర్‌ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరాన్ని ఆయన మంత్రి గడ్కరీకి వివరించారు.

వైయస్‌ అవినాష్‌ రెడ్డి ప్రతిపాదించిన పై మూడు అంశాలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వీటిపై త్వరలో చర్యలు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ వర్గాలు తెలియజేశాయి.

వైఎస్సార్‌ జిల్లాలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, కడప నగరంలో ట్రాఫిక్‌ నిర్వహణ, పాదచారుల భద్రత, పార్కింగ్‌ సౌకర్యాల మెరుగుదల కోసం ఈ ప్రతిపాదనలు అమలు అయితే ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.