రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లాలో రూ.16,300 కోట్ల ఇంధన, పర్యాటక ప్రాజెక్టులు
కడప: కడప జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో మరో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. హరిత ఇంధనం, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, కుదిరిన అవగాహనా ఒప్పందాల ఆధారంగా సుమారు రూ.16,306 కోట్ల విలువైన ప్రాజెక్టులు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. వీటి ద్వారా జిల్లాలో దాదాపు 4,200 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూముల గుర్తింపు, ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు సిద్ధం చేసే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు స్టార్టప్ కడప ద్వారా కొత్త అంకుర సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుండగా, మరోవైపు బృహత్ పరిశ్రమలు రావడంతో జిల్లా పారిశ్రామిక రంగం వేగంగా పురోగమిస్తోంది. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమలో కడప జిల్లా ముఖచిత్రం మారే అవకాశముందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.
హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడితో కూడిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభంకానుంది. చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును కొండాపురం మండలం కొప్పోలు గ్రామ పరిసరాల్లో ఏర్పాటు చేయనుంది. రూ.15,050 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,600 మందికి ఉపాధి లభించనుంది. ప్రాజెక్టు కోసం మొత్తం 816.25 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 595.63 ఎకరాలు, డీకేటీ భూమి 166.59 ఎకరాలు, ప్రైవేట్ పట్టా భూములు 54.03 ఎకరాలు ఉన్నాయి.
పునరుత్పాదక ఇంధన రంగంలో విండ్–సోలార్ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్ట్ రూపంలో మరో కీలక అడుగు పడబోతోంది. హెక్సా ఎనర్జీ బీహెచ్ ఫైవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 400 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. మైలవరం మండలం తొర్రివేముల గ్రామంలో 269.32 ఎకరాలకు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. జమ్మలమడుగు మండలం గండికోట, పూరబొమ్మేపల్లి, అంబవరం గ్రామాల్లో 64.23 ఎకరాలు, ముద్దనూరు మండలం ముద్దనూరు, యామవరం, తుగ్లపల్లి గ్రామాల్లో 42.49 ఎకరాలకు పొజిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
పర్యాటక రంగంలో కూడా కడప జిల్లా కొత్త ఊపిరి పీల్చుకోనుంది. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గండికోటలో అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. జెన్ రిసార్ట్స్ సంస్థ కాస్మిక్ శాంక్చురీ పేరుతో విలాసవంతమైన రిసార్ట్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.56 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించింది. రిసార్ట్ ద్వారా సుమారు 200 మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. గండికోట పరిధిలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాల్సిందిగా సంస్థ యాజమాన్యం పర్యాటక శాఖ ద్వారా జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం.
పెద్ద ఎత్తున హరిత ఇంధన, పర్యాటక ప్రాజెక్టులు జిల్లాకు రావడం స్థానిక ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటంతో పాటు, కడపను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా దోహదం చేయనుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి.













