రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు (కడప): రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గతంలో అమల్లో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీ సదుపాయాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ఒక అధికారిక లేఖ పంపించారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల ప్రయాణ రాయితీని దేశవ్యాప్తంగా సాధారణ రైలు సర్వీసులు పునరుద్ధరించినప్పటికీ ఇప్పటివరకు తిరిగి అమల్లోకి తీసుకురాకపోవడం విచారకరమని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నిర్వహణకు ఈ రాయితీ కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

జర్నలిస్టుల ప్రయాణ రాయితీ చరిత్రను కూడా ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. 1950ల నుంచే జర్నలిస్టులకు ప్రత్యేక రైల్వే ప్రయాణ రాయితీ సదుపాయం అమల్లో ఉందని గుర్తుచేశారు. 2009లో ఫోటో గుర్తింపు కార్డు ఆధారిత కన్సెషన్ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2010లో ఈ రాయితీని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా విస్తరించిన విషయాన్ని ఆయన లేఖలో వివరించారు.
అనంతరం 2016 నుండి IRCTC ద్వారా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించడంతో జర్నలిస్టుల ప్రయాణ రాయితీ సేవ మరింత సులభతరమైందని ఎంపీ పేర్కొన్నారు. ఈ విధంగా దశాబ్దాలుగా అమల్లో ఉన్న సౌకర్యాన్ని కోవిడ్-19 కారణంగా నిలిపివేసిన తర్వాత ఇప్పటికీ పునరుద్ధరించకపోవడం జర్నలిస్టుల వృత్తి నిర్వహణపై ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సమాజానికి నిష్పక్షపాత సమాచారాన్ని అందించే క్రమంలో జర్నలిస్టులు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖలో వివరించారు. అలాంటి పరిస్థితుల్లో రైల్వే ప్రయాణ రాయితీ జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు, ఆర్థిక సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం రైల్వే శాఖ అన్ని రకాల రైలు సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చిన నేపథ్యంలో, గుర్తింపు పొందిన జర్నలిస్టుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే ట్రావెల్ కన్సెషన్‌ను అత్యవసరంగా పునరుద్ధరించాలని కేంద్ర రైల్వే శాఖను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ ద్వారా కోరారు. జర్నలిస్టుల వృత్తి స్వభావం, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి పాత్రను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన లేఖలో సూచించారు.













