మైదుకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, యువత భవిష్యత్తుకు వెన్నుముకలైన విద్యావ్యవస్థను ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్సార్ జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. మైదుకూరులో స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో రఘురామిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

భావితరాలను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ నియామకాల్లో కూడా కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకతను పూర్తిగా పక్కన పెట్టి, అవినీతి, అక్రమాలకు పాల్పడటం వల్ల విద్యా రంగం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు.

“అవినీతి మార్గంలో ఉద్యోగాలు సంపాదించిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఏ విధంగా నీతి పాఠాలు బోధించగలరు?”

అని రఘురామిరెడ్డి ప్రశ్నించారు. తక్షణమే డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను పారదర్శకంగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సిపి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం నారా లోకేష్‌కు ఉందా అని ఘాటుగా సవాల్ విసిరారు.

డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయని రఘురామిరెడ్డి అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యా రంగంపై జరుగుతున్న దాడులను ప్రజలకు తెలియజేయడానికి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఈనెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు మైదుకూరులో వైఎస్ఆర్సిపి శ్రేణుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఈనెల 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్ఆర్సిపి శ్రేణులు స్పష్టం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.