రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, దీనితో ప్రజలను మరోసారి మోసం చేయలేరని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లెలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మూడు గంటల పాటు ప్రజంటేషన్ ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నట్లు చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపి, కోటిన్నర మందికి సంక్షేమ పథకాలు అందించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాల్లో రూ.3.65 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కొండంత హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆచరణలో గోరంత కూడా అమలు చేయడం లేదని రాచమల్లు విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఎగవేతలు, కోతలు విధిస్తూ తీవ్రంగా నిరాశపరుస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన దుయ్యబట్టారు.
రెండు సంవత్సరాల్లో 22 లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ప్రజల ముందు వివరాలు వెల్లడించాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన ‘సూపర్ సిక్స్’ హామీలకే చంద్రబాబు ప్రభుత్వం వంగనామాలు పెట్టిందని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే హామీలను ఎంతవరకు అమలు చేశారో స్పష్టంగా తెలియజేస్తూ తక్షణమే ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాచమల్లు సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో పారదర్శకత చూపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కరోనా వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తొలి ఏడాదిలోనే రూ.1.31 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని రాచమల్లు గుర్తుచేశారు. ఆ సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ అత్యంత పారదర్శకంగా పాలన సాగించారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలను అబద్ధాలతో ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించిన రాచమల్లు, ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు పూర్తిగా అర్థమయ్యాయని పేర్కొన్నారు. అబద్ధాల పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా అబద్ధాల ప్రచారం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.













