రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు..
తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ
కృష్ణా పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నా, దిగువకు నీటి విడుదల లేక తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నది ఎండిపోతూ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో గణనీయంగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అవుట్‌ఫ్లోను దాదాపు నిలిపివేయడంతో తెలంగాణలోని కృష్ణా నది పునరుత్తేజం పొందకుండా ఉంది.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఆల్మట్టిలో సుమారు 67 శాతం నీటి నిల్వ ఉండగా, భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అయినప్పటికీ దిగువకు నీటి విడుదలను తగ్గించడంతో జూరాల, భీమా వంటి తెలంగాణ ప్రాజెక్టులకు వరద నీరు చేరడం లేదు. ఫలితంగా రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా నది అడుగంటి, నది పాదంలో రాళ్లు బహిర్గతమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
జూలై నెల సగం దాటినా కృష్ణా నదిలో వరద రాకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాకాలం మధ్యలోనే నది ఎండిపోయే పరిస్థితి రావడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు, తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీటి మీద ఆధారపడే ప్రాంతాల్లో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా జూరాల, భీమా ప్రాజెక్టుల కమాండ్ ఏరియాల్లో ఉన్న రైతులు నీటి కొరత భయంతో ఉలిక్కిపడుతున్నారు.
ఇక మహారాష్ట్ర, కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఈ సమయంలో, తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో డ్యామ్‌లు నిండిపోయి ఉండగా, దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నీటి ప్రవాహం నిలిచిపోవడం అన్యాయమని వారు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా నీటి పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా ముందుకు వెళ్లి, కర్ణాటకతో చర్చలు జరిపి, అవసరమైన మేరకు నీటి విడుదలకు ఒప్పించాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నదిలో వరదలు రాకపోవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బోర్లు, చెరువులపై ఒత్తిడి పెరుగుతోంది. వర్షాల పరిస్థితి, ఎగువ రాష్ట్రాల నీటి విధానంపై ఆధారపడి రానున్న రోజుల్లో తెలంగాణలో కృష్ణా నీటి లభ్యత ఏ విధంగా ఉండబోతోందన్న దానిపై రైతులు కళ్లప్పగించి చూస్తున్నారు.







