రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో కన్నతల్లి కాలయముడిగా మారిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆగ్రహంతో ఒక తల్లి తన సొంత కుమారుడిని కత్తెరతో పొడిచి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం నగరంలో మొదటి రోడ్డు, శివాలయం సమీపంలో నివసిస్తున్న బ్రహ్మచారి, సునీతమ్మ దంపతులకు కుమారుడు సురేంద్ర ఆచారి, ఒక కూతురు ఉన్నారు. చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న సురేంద్ర ఆచారి కాలక్రమేణా దారి తప్పి మద్యానికి బానిసయ్యాడు.
తండ్రి బ్రహ్మచారి కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతనికి తోడ్పాటుగా ఉండాల్సిన సురేంద్ర ఆచారి మద్యం కోసం తల్లిదండ్రులను వేధించడం ప్రారంభించాడు. రోజూ మద్యం తాగి వచ్చి డబ్బుల కోసం గొడవలు పెట్టడం, తల్లిదండ్రులపై దాడి చేయడం అలవాటుగా మారింది.
ఈ క్రమంలో గురువారం కూడా సురేంద్ర ఆచారి విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో పాటు, వారిపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు నిరంతర వేధింపులు భరించలేక తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి సునీతమ్మ ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర ఆచారి ఛాతిలో బలంగా పొడిచింది.
ఛాతిలో గాయాలు తీవ్రంగా ఉండటంతో సురేంద్ర ఆచారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తల్లి చేతిలో కొడుకు హత్యకు గురైన ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. మద్యం వ్యసనం కుటుంబాలను ఎలా దారుణ పరిణామాలకు గురిచేస్తుందో ఈ సంఘటన మరోసారి స్పష్టంచేసిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. సునీతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.













