రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమరావతి: అర్నబ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడడంతో రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. వివిధ విభాగాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఇప్పటివరకు రూ.4,764 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని 12 జిల్లాలు తుపాన్ ప్రభావానికి గురయ్యాయి.
తుపాన్ ప్రభావం, నష్టాల స్థితిగతులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ బృందం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమావేశమైంది.
కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సమక్షంలో తుపాన్ వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన ఉపశమన, పునరావాస చర్యలపై పవర్ పాయింట్ ద్వారా వివరణ ఇచ్చారు. తుపాన్ ముందస్తు హెచ్చరికలు, ప్రజల తరలింపు, అత్యవసర సేవల నిర్వహణ, పునరుద్ధరణ చర్యలపై వివరాలు అందించారు.
తుపాన్ సమయంలో ప్రాణనష్టం తగ్గించడంలో రాష్ట్రం వినియోగించిన సాంకేతిక సదుపాయాలపై కేంద్ర బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా 'మనమిత్ర' యాప్, రియల్ టైమ్ హెచ్చరికల వ్యవస్థ ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారం అందించి, ప్రమాద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్రం సాధించిన ఫలితాలను బృందం పరిశీలించింది.
ఈ నేపథ్యంలో 'మనమిత్ర' యాప్, రియల్ టైమ్ హెచ్చరికల వ్యవస్థ పనితీరుపై కేంద్ర బృందం ప్రశంసలు వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలను అమలు చేయాలని సిఫార్సు చేస్తామని బృందం వెల్లడించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అర్నబ్ తుపాన్ తీవ్రంగా ప్రభావితమైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నష్టాల స్థితిగతులను ప్రత్యక్షంగా అంచనా వేయడానికి కేంద్ర నిపుణుల బృందం నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. వరదలు, గాలివానల ప్రభావం, వ్యవసాయ రంగం, గృహాలు, మౌలిక వసతులు, విద్యుత్, రహదారి, తాగునీటి సరఫరా వంటి రంగాల్లో జరిగిన నష్టాలను ఈ బృందం పరిశీలించనుంది.
కేంద్ర బృందం నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలు, ఉపశమన చర్యలను కొనసాగిస్తోంది.







