రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులు, జరుగుతున్న విచారణలతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో ఆందోళన వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సమయంలో ఎటువైపు నుంచి ఏ కేసు ముంచుకొస్తుందోనన్న అనిశ్చితి ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ప్రధానంగా నాలుగు కీలక కేసుల విషయంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ Y.S. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధిత నిందితులను ఈడీ విచారణకు పిలుస్తుండటం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా హత్య కేసుల్లో ఈడీ జోక్యం అరుదుగా ఉండే నేపథ్యంలో, ఈ కేసులో కేంద్ర సంస్థ పాత్రపై విశేష చర్చ సాగుతోంది.
అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిపై ఉన్న పాత ఆస్తి, అవినీతి సంబంధిత కేసులను రోజువారీ విచారణకు పెట్టాలని ఈడీ కోర్టును ఆశ్రయించడం కూడా రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పదిహేనేళ్ల క్రితం నాటి కేసులను తిరిగి ముందుకు తెచ్చే ప్రయత్నం వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి బంధువులు కూడా నిందితుల జాబితాలో ఉండటం, పులివెందుల, కడప మున్సిపల్ ఎన్నికల్లో వారి పాత్ర కీలకంగా ఉండటం వల్ల ఈ కేసు విచారణ స్థానిక రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కడప MP అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొంటుండటం వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ పెంచుతున్న అంశంగా చెప్పబడుతోంది.
కీలకమైన ఎన్నికల సమయంలో ఈడీ విచారణలకు హాజరుకావాల్సి రావడంతో వైసీపీ నేతలు రాజకీయ వ్యూహాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లిక్కర్ కుంభకోణం, లిక్కర్ రవాణా స్కాం కేసుల్లో ఈడీ చర్యలు కూడా వైసీపీకి తలనొప్పిగా మారాయి.
ఈ కేసుల్లో ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, ఆయన కుమారుడు సునీల్ అరెస్టు అయ్యారు. ఇదే లిక్కర్ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు , చిత్తూర్ జిల్లా వైసీపీ కీలక నేత విజయానంద్ రెడ్డి లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిపై తదుపరి చర్యలపై స్పష్టత లేకపోయినా, ఎన్నికల ప్రచారం మధ్యలో విచారణల ద్వారా వైసీపీ నేతలకు చికాకు కలిగించే వ్యూహం అమలవుతోందా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మొత్తం నాలుగు కేసుల విషయంలో ఈడీ ఒకేసారి దూకుడుగా ముందుకు రావడం వైసీపీలో ఆందోళనకు కారణమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసే అవకాశాలు ఉండగా, ఆయనపై పాత కేసులను రోజువారీ విచారణకు పెట్టాలని ఈడీ కోరిన సమయం కూడా యాదృచ్ఛికం కాదని, దీని వెనుక రాజకీయ వ్యూహం ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అదే విధంగా గత ప్రభుత్వ కాలంలో చోటుచేసుకుందని ఆరోపిస్తున్న లిక్కర్ కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసులపై నిరంతరం ప్రజల్లో చర్చ కొనసాగేలా ఈడీ ద్వారా విచారణలు, అరెస్టులు చేయించడం ద్వారా వైసీపీపై ఒత్తిడి పెంచాలని ప్రభుత్వ పెద్దలు వ్యూహరచన చేశారనే ఆరోపణలు ప్రతిపక్ష వర్గాల్లో వినిపిస్తున్నాయి.







