స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం బాబు ఫోకస్

డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

అమరావతి: జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను నిర్దేశించారు.

నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు వాస్తవ వృద్ధి ఆధారంగా పనితీరును అంచనా వేసే విధంగా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి శాఖ పనితీరును స్పష్టంగా కొలిచే అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు.

రాష్ట్ర, క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా విశ్లేషించేందుకు ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం కనీసం 3.5 రెట్లు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్‌లో ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏఐ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమావేశంలో చర్చించారు. ఈ టాస్క్‌ఫోర్స్ ద్వారా ఆర్థిక సూచికలను నిరంతరం పరిశీలించి, అవసరమైన సవరణలు చేయగలగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు..

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రతీ రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ పెంపుదల కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తయారీ, గనులు, వాణిజ్యం, రవాణా వంటి రంగాలతో పాటు అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మల్టీప్లైయర్ ఎఫెక్ట్ కలిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు మెరుగ్గా ఉంటే రాష్ట్ర వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.