రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న తాజా ఆవిష్కరణలను, ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్య సేవలు, డిజిటల్ విద్య వంటి విభాగాల్లో స్బేర్ సిటీ తీసుకొస్తున్న పరిష్కారాలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్శనలో భాగంగా నారా లోకేష్ స్బేర్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎటిఎంను పరిశీలించారు. వ్యాధినిర్ధారణతో పాటు ఇతర ఆవిష్కరణాత్మక సదుపాయాలు కలిగిన ఈ ఎటిఎం పనితీరును అక్కడి నిపుణులు మంత్రి కి వివరించారు. ఎటిఎం ద్వారా అందించే సేవల విధానం, ఉపయోగించే సాంకేతికత, డేటా భద్రత వంటి అంశాలపై లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్బేర్ సిటీ ప్రతినిధులు అక్కడి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కి సమగ్రంగా వివరించారు. ఆర్ & డీ విభాగం ద్వారా అభివృద్ధి చేస్తున్న కొత్త సాంకేతిక పరిష్కారాలు, వాటి వినియోగం, భవిష్యత్ ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా క్వాంటం టెక్నాలజీ సెంటర్ కార్యకలాపాలు, అందులో జరుగుతున్న పరిశోధనల దిశ, వాటి అన్వయంపై స్బేర్ సిటీ బృందం వివరాలు అందించింది. క్వాంటం కంప్యూటింగ్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్న సేవలు, భద్రతా ప్రమాణాలు, డేటా ప్రాసెసింగ్ సామర్థ్యాలపై కూడా మంత్రి కి వివరణ ఇచ్చారు.
ఏఐ ఆధారిత సేవల విభాగంలో స్బేర్ సిటీ చేపడుతున్న కార్యక్రమాలను కూడా నారా లోకేష్ పరిశీలించారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా బ్యాంకింగ్, ఆరోగ్య, విద్య, భద్రత రంగాల్లో అందిస్తున్న పరిష్కారాలను ప్రతినిధులు ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. డిజిటల్ హెల్త్ కేర్ సేవల రూపకల్పన, అమలు విధానం, రోగుల డేటా నిర్వహణ, టెలీమెడిసిన్ వంటి అంశాలపై కూడా మంత్రి కి వివరించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ద్వారా డిజిటల్ లావాదేవీలు, వ్యక్తిగత డేటా, ప్రభుత్వ వ్యవస్థల భద్రతను ఎలా బలోపేతం చేస్తున్నారో స్బేర్ సిటీ నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.
డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ విభాగంలో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్ములు, విద్యార్థుల ప్రగతి విశ్లేషణ, వ్యక్తిగతీకరించిన బోధన విధానాలపై స్బేర్ సిటీ ప్రతినిధులు సమగ్రంగా వివరించారు. ఈ మొత్తం సందర్శనలో సాంకేతిక రంగంలో జరుగుతున్న పురోగతిని, వాటి అమలు విధానాన్ని నారా లోకేష్ సమీక్షించినట్లు సమాచారం.







