రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
అనుమతి ఇచ్చివుంటే వివాదం ఉండేదికాదు!
తెలంగాణ రాజకీయాలపై మరోసారి స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై మరోసారి స్పందించారు. అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన గురువారం సందర్శించారు. అక్కడ పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఇంకా ప్రాంతీయ నినాదం బలంగా ఉనికిలో ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం “ఆంధ్ర” అనే ప్రత్యేక ఉనికి రాజకీయంగా కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో తన సమావేశానికి అనుమతి ఇచ్చి ఉంటే కార్యక్రమం సాదాసీదాగా జరిగిపోయేదని, అప్పుడు ఈ స్థాయిలో వివాదం తలెత్తేదేమీ కాదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజల గురించి తాను ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణ భూమిపుత్రులే జనసేన తరఫున పోటీ చేస్తామంటే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇటీవల తనపై వ్యాఖ్యలు చేసిన BRS నేత KTR విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే తెలంగాణ సచివాలయంలో కూర్చుని పెత్తనం చెలాయిస్తామంటే అంగీకరించమని KTR చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్, KTR తనకు సోదరుడిలాంటి వారని అన్నారు. ఆయన ఏమన్నారో పూర్తిగా వినలేదని, తన గురించి తప్పుగా మాట్లాడి ఉండరని భావిస్తున్నట్టు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం, ప్రాంతీయవాదం రెండూ వేర్వేరు అంశాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విభజించుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి ఎక్కడికి చేరుకుంటామని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదని, జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామని తాము చెబుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో తనకు ఇల్లు ఉందని, అక్కడికి కూడా వెళ్లకూడదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా అని ప్రతిప్రశ్నించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరిగాయనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలే పనిగట్టుకుని విద్వేషాలు రేపుతున్నారని ఆరోపించారు.
ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల మధ్య విభేదాలు పెంచే రాజకీయాలకు తాము వ్యతిరేకమని, సామరస్య వాతావరణం నెలకొనేలా ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.







