రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులకి చెరుకు గెడల్ని ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ రెండు కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు
జయంత్, అభిమన్యులకు గతంలో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉంది. అందుకే ముందుగా వాటిని అక్కడికి పంపిస్తున్నారు. ఒడిశా నుంచి అడవి ఏనుగులు వచ్చి పంటపొలాల్ని ధ్వంసం చేస్తున్నాయని, అక్కడి ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఒడిశా నుంచి కూడా కొన్ని కుంకీ ఏనుగుల్ని రప్పించి అడవి ఏనుగుల్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈలోగా మనవద్ద ఉన్న కుంకీలతో వీలైనంతమేర అడవి ఏనుగుల్ని అడవిలోకి పంపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.







